భీమవరంలో బరితెగిస్తున్న అసాంఘిక శక్తులు

11 May, 2018 12:45 IST|Sakshi
భీమవరంలో నారిశెట్టి సునీల్‌కుమార్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్‌)

భీమవరం టౌన్‌: భీమవరంలో అసాంఘిక శక్తులు మళ్లీ బరితెగిస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న నేర స్వభావం కలిగిన వాళ్లంతా మళ్లీ రోడ్లపైకి వస్తున్నారు. భీమవరం వన్‌టౌన్‌ పరిధిలోని బ్యాంక్‌ కాలనీ శివారు సెంట్‌ ఆన్స్‌స్కూల్‌ వెనుక ఖాళీ స్థలంలో ఈనెల 8వ తేది రాత్రి నారిశెట్టి సునీల్‌ కుమార్‌ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేయడం ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారు. నివాసిత ప్రాంతాలకు అతి చేరువలో సునీల్‌ కుమార్‌తో కలిసి దుండగులు మద్యం సేవించి హత్య చేసినట్లుగా అంతా భావిస్తున్నారు. ఈ హత్యతో  వన్‌టౌన్‌ ప్రాంతంలో శాంతి భద్రతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రౌడీషీటర్‌ల మధ్య ఏర్పడిన వివాదంలో టూటౌన్‌ పరిధిలో పద్మాలయా థియేటర్‌ వెనుక రోడ్డులో కోడే వెంకట్‌ అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఆ కేసులో ఒక నిందితునితో సునీల్‌ కుమార్‌ సన్నిహితంగా ఉంటుండమే హత్యకు దారితీసినట్లుగా తెలుస్తోంది. కోడే వెంకట్‌కు సన్నిహితంగా ఉండే సునీల్‌ కుమార్‌ వెంకట్‌  హత్య అనంతరం ప్రత్యర్థి వర్గంతో సన్నిహతంగా మెలుగుతున్న కారణంగానే సన్నిహితులు జీర్ణించుకోలేక హత్య చేసినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

రౌడీ షీటర్లపై వన్‌టౌన్‌ పోలీసులు దృష్టి పెట్టినప్పటికీ నేర స్వభావం కలిగినవారిపై అంతగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఖాళీగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కరంగా మారిన వ్యక్తులు పగలు, రాత్రి బాహాటంగా మద్యం సేవిస్తూ నివాసితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెస్ట్‌హౌస్‌ రోడ్డు, బ్యాంక్‌ కాలనీ శివారు, సుంకరపద్దయ్య వీధి, జనపాల వారి వీధి, పాతయనమదుర్రు డ్రెయిన్‌ రోడ్డు, శ్రీనివాస ధియేటర్‌ సెంటర్, మెంటేవారితోట, గునుపూడి శివారు, చినరంగనిపాలెం ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలే నేర స్వభావం కలిగిన వారికి అడ్డాలుగా మారుతున్నాయి. మద్యం మత్తులో కొట్టుకుని కేకలు వేసుకోవడంతో నివాసితులు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్‌ నిఘా కూడా అంతంత మాత్రంగానే వన్‌టౌన్‌ ప్రాంతంలో ఉండడం విమర్శలకు తావిస్తోంది.

రెండు క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరాలపై ఇటీవల దాడి చేసి బుకీలను అరెస్ట్‌ చేశామన్న ఆనందంలో ఉన్న వన్‌టౌన్‌ పోలీసులకు సునీల్‌ కుమార్‌ హత్యతో ఇక్కడి శాంతి భద్రతులు గుర్తు చేస్తోంది. ఉన్నతాధికారుల మెప్పు కోసం కొందరు క్రింది స్థాయి సిబ్బంది అంతా తమదే పెత్తన్నమట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసుల్లో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఇటీవల కొంతకాలంగా వన్‌ స్టేషన్‌లో తనదే పెత్తనమంటూ వ్యవహరిస్తుండడం, తోటి సిబ్బందిని ఆవేదనకు గురి చేస్తున్నట్లు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లోని అల్లరి మూకలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోతే శాంతి భద్రతలకు మరింత భగం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

>
మరిన్ని వార్తలు