పట్టుబడుతున్న కట్టలు.. కట్టలు!

11 Apr, 2019 04:24 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న నగర పోలీసు కమిషనర్, పోలీసులు

బెజవాడలో రూ. 1.92 కోట్లు సీజ్‌! 

ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థికి చెందినవిగా అనుమానం 

ఆగిరిపల్లిలో రూ.7.79 లక్షల పట్టివేత 

ముగ్గురు టీడీపీ నేతలపై కేసు నమోదు 

సాక్షి, అమరావతి బ్యూరో/ఆగిరిపల్లి : ఇంకొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభమవుతుందనగా.. ఓటమి భయం పట్టుకున్న టీడీపీ శ్రేణులు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే దుస్సంకల్పంతో ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున నగదు తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రహస్యంగా సిమెంటు లారీలో తరలిస్తున్న రూ. 1.92,90,500ను విజయవాడ నగర పటమట పోలీసులు.. అదేజిల్లా ఆగిరిపల్లిలో రూ.7,79,750ను ఎన్నికల  ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణాజిల్లా  జగ్గయ్యపేట నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వెళ్తున్న ఏపీ16 టీసీ 3308 నంబరు గల సిమెంట్‌ లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో సిమెంట్‌ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దాన్ని తెరచి చూడగా.. అందులో భారీ నగదు కనిపించింది. పోలీసులు తనిఖీ  చేస్తుండగానే లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పరారయ్యాడు. డ్రైవర్‌ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళుతున్నానని తనతోపాటు లారీలో వచ్చిన యువకుడు చెప్పాడని పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన రూ. 1.92,90,500కు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు సీజ్‌ చేశారు.  

ఆగిరిపల్లిలో.. 
ఆగిరిపల్లిలోని హనుమాన్‌జంక్షన్‌ రోడ్డులో ఉన్న బాలాజీ రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్‌లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్, అధికారులు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓటర్‌ లిస్టులు, రూ.7,79,750ను స్వాధీనం చేసుకున్నారు.. దీంతో తనిఖీల్లో పట్టుబడిన  నగదును, ఓటర్‌ లిస్టును, టీడీపీకి చెందిన మిల్లు యజమాని మడుపల్లి గోపాలకృష్ణ కుమార్, అతని సోదరుడు చంద్రమోహన్,  మైనార్టీ నేత షేక్‌ భాషాను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన నగదు  మిల్లుకు సంబంధించినదని మిల్లు యజమాని గోపాలకృష్ణ కుమార్‌ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు తెలిపారు. స్క్వాడ్‌ అధికారులు మాట్లాడుతూ మిల్లులో నగదుతో పాటు, ఓటరు లిస్టు, టీడీపీ మైనార్టీ నాయకులు ఉన్నట్లు గుర్తించామని, నగదును  సీజ్‌ చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు