సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

24 Jun, 2019 10:34 IST|Sakshi

సాక్షి, సదుం(చిత్తూరు) : మండలానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలో మృతి చెందారు. బంధువుల కథనం మేరకు.. బూరగమంద పంచాయతీ గంటావారిపల్లెకు చెందిన దివంగత సిద్ధయ్య కుమారుడు గంటా రవికుమార్‌ పదేళ్లకు పైగా సీఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చండీఘర్‌లో పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం అతనికి విజయతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ప్రశాంత్‌ (4) ఉన్నాడు. 15 రోజుల క్రితం అతని భార్య విజయ ఆడశిశువును ప్రసవించడంతో జూన్‌ 4న అతడు సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. భార్యాపిల్లలతో సంతోషంగా గడిపి, తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఈ నెల 17న బయలు దేరాడు. 20న ఢిల్లీకి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

చండీఘర్‌ వెళ్లే ట్రైన్‌ వచ్చేందుకు సమయం ఉండటంతో ప్రైవేటు హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచి అతనికి పలుమార్లు కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా తీయలేదు. ఈ క్రమంలో హోటల్‌ గదిలో అపస్మారక స్థితిలో రవికుమార్‌ ఉన్నాడని, అతనిని ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులకు ఈ నెల 21న రాత్రి సమాచారం అందింది. అతని తమ్ముడు ఈశ్వరయ్య గ్రామానికి చెందిన మధుతో కలిసి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ చికిత్స పొందుతున్న రవికుమార్‌ శనివారం రాత్రి మృతి చెందినట్లు వారు గ్రామస్తులకు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. 

మరిన్ని వార్తలు