ఉసురు తీసిన విద్యుత్‌

21 Aug, 2018 07:44 IST|Sakshi
మృతి చెందిన  సుబ్రమణ్యం (ఇన్‌సెట్‌) వెంకటేశ్వర్లు

రుద్రవరం/నంద్యాల(కర్నూలు): రుద్రవరం మండలంలోని మాచినేని పల్లె గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(46) ఎరుగుడిదిన్నె చెరువు సమీపంలో ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. తెలుగుగంగ కాలువకు నీరు విడుదల చేయడంతో నారుమడి సాగుచేశాడు. సోమవారం ఉదయం పక్క రైతు బోరు నుంచి ఆయన అనుమతితో నారుమడికి నీరు పారించుకునేందుకు మోటార్‌ వద్దకు వెళ్లి స్విచ్‌ ఆన్‌ చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు గమనించి విద్యుత్‌ శాఖాధికారులకు సమాచారం అందించడంతో సరఫరాను నిలిపేశారు. అయినా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతితో భార్య, పిల్లలు బోరున విలపించారు. ఎస్‌ఐ చిన్నపీరయ్య యాదవ్‌ అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నందమూరినగర్‌లో.. 
విద్యుదాఘాతానికి గురై రేపల్లె వెంకటేశ్వర్లు(45) మృతి చెందిన సంఘటన నంద్యాల పట్టణ శివారులోని నందమూరినగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నంద్యాల తాలుకా ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు.. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన రేపల్లె వెంకటేశ్వర్లు నంద్యాల పట్టణ శివారులోని నందమూరినగర్‌ వద్ద 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఆదివారం రాత్రి సలికెపారతో కాల్వ తీస్తుండగా కరెంటు తీగ పక్కన ఉండటం గమనించి చేత్తో పక్కకు తీసివేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. ఎంత సమయమైనా ఇంటికి రాకపోవడంతో బంధువులు పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి  హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు