బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..

15 Nov, 2019 08:25 IST|Sakshi

సాక్షి, మహానంది : హోటల్‌కు వచ్చాడు.. జొన్నరొట్టె.. చికెన్‌ తదితర వాటిని ఆర్డర్‌ చేశాడు.. కడుపునిండా తిన్నాడు.. బిల్లు చెల్లించమని అడిగితే మద్యం మత్తులో గొడవపడి హోటల్‌ నిర్వాహకుడి కుమారుడి చెవిని కొరికాడు.. ఈ ఘటన మండలంలోని గాజులపల్లెలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..  రంగస్వామి, లక్ష్మి గాజులపల్లె మెట్ట వద్ద చిన్న హోటల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు మహేష్‌ హోటల్‌లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా పనిచేస్తున్నాడు.

రొట్టె, పప్పు, చికెన్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారి హోటల్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వచ్చాడు. కడుపు నిండా తిని సుమారు రూ. 200 బిల్లు చేశాడు. తిన్నవాటికి డబ్బులు ఇవ్వాలని అడుగగా వారితో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.  శివదీక్షలో ఉన్న మహేష్‌ చెవిని శ్రీను కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 16 కుట్లు పడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. వారు మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.  ఎస్‌ఐ  మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు