సైనైడ్‌తో సొంతవాళ్ల హత్య.. పోలీసులకు సవాల్‌..!

12 Oct, 2019 18:52 IST|Sakshi

ఆస్తి కోసం కుటుంబ సభ్యులను హత్య చేసిన మహిళ

17 ఏళ్ల క్రితం తొలి హత్య, మూడేళ్ల క్రితం ఆరో మర్డర్‌

కేసు విచారణ సవాల్‌తో కూడుకున్నదని డీజీపీ వ్యాఖ్య

తిరువనంతపురం : ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని హతమార్చిన కిరాతక మహిళ జూలీ అమ్మా జోసెఫ్‌ కేసుపై కేరళ డీజీపీ లోక్‌నాథ్‌ బెహ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ సవాల్‌తో కూడుకున్నదని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల క్రితం మొదటి హత్య, మూడేళ్ల క్రితం ఆరో హత్య జరిగిన నేపథ్యంలో ఆధారాల సేకరణ క్లిష్టంగా మారిందని అన్నారు. అయినప్పటికీ కేసు సమగ్ర విచారణకు ఆరు బందాల్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలు జూలీ, ఆమెకు సెనైడ్‌ సప్లై చేసిన ఎం.ఎస్‌ మాథ్యూ, జ్యూయెలరీ స్టోర్‌ మేనేజర్‌ ప్రజూ కుమార్‌లు పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తన మొదటి భర్త రాయ్‌ థామస్‌ హత్య కేసులో కింది కోర్టు గురువారం ఈ ముగ్గురికీ రిమాండ్‌ విధించింది. ఆరు రోజుల పోలీసులు కస్టడీలో ఉన్న నిందితుల్ని పోలీసులు పలుమార్లు విచారించారు. జూలీ రెండో భర్త షాజు కూడా పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
(చదవండి :14 ఏళ్లు.. 6 హత్యలు)

ఆరు కేసులు వేటికవే ప్రత్యేకం..
‘ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్‌ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్‌ థామస్‌ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్‌ థామస్‌ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌ థామస్‌ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి’అని డీజీపీ బెహ్రా వెల్లడించారు. ఈ హత్యలపై శుక్రవారం 5 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

అనుమానం కలిగిందిలా..
తన భర్త రాయ్‌ థామస్‌ 2008 ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు జూలీ అల్లిన కథను అందరూ నమ్మారు. అయితే, ఇక్కడే ఆమె పథకం పారలేదు. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే తన అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడంపై అమెరికాలో ఉండే అతని సోదరుడు మోజోకు అనుమానం వచ్చింది. దాంతోపాటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటంతో మోజో అనుమానం మరింత బలపడింది. అతని ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. రాయ్‌ థామస్‌ సైనైడ్‌ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్‌ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడుతున్నాయి. పూర్తి ఆధారాల సేకరణ అనంతరం కేసు కొలిక్కి రానుంది.

మరిన్ని వార్తలు