లవ్‌ గేమ్‌ ప్రణయం.. పరిణయం.. మోసం

7 Feb, 2020 07:58 IST|Sakshi

గౌలిగూడ యువతి..అంబర్‌పేట యువకుడు

ఇరువురూ ప్రేమించుకుని ‘గాంధర్వ వివాహం’

యువతి ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సృష్టి

లైవ్‌సెక్స్‌ చాట్‌ పేరుతో రెండేళ్లుగా వసూళ్లు  

సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఆ ఇద్దరి మధ్య అంకురించిన పరిచయం ప్రణయంగా మొగ్గ తొడిగింది. పరిణయ పుష్పమైవికసించింది. అనంతరం ఆ పువ్వు మాటున ముల్లు పొంచి ఉందన్న అసలు నిజం వెలుగుచూసిన ఘటన ఇది.నగరానికి చెందిన ఓ యువతిని పొరుగు రాష్ట్రంలో ‘గాంధర్వ వివాహం’ పద్ధతిలో పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు కాపురం చేసిన సిటీ యువకుడు ద్రోహానికి పాల్పడ్డాడు. తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. యువతి చిత్రాన్ని వినియోగించి ఇన్‌స్టాగ్రామ్‌లో బోగస్‌ ఖాతా తెరిచాడు. లైవ్‌ సెక్స్‌ చాట్‌ అంటూ అనేక మంది నుంచి డబ్బులు గుంజాడు.. ఆపై పలాయనం చిత్తగించాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని అంబర్‌పేటకు చెందిన యువకుడు ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. అతడికి మూడేళ్ల క్రితం గౌలిగూడ నివాసి అయిన ఓ యువతితో అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఆపై కర్ణాటకలోని ఓ గుడికి యువతిని తీసుకువెళ్లి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి.. నిన్ను వివాహం చేసుకున్నానంటూ చెప్పాడు. ఆ తర్వాత అతడితో పాటు సదరు యువతి అంబర్‌పేటకు వచ్చింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు జీవించారు. 2018లో యువతికి తెలియకుండా, ఆమె పేరు, ఫొటో వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ ఖాతా తెరిచాడు. అందులో లైవ్‌ సెక్స్‌ చాట్‌ అంటూ పలువురిని ఆకర్షించాడు.

ప్రతి నెలా నంబర్‌ మారుస్తూ..
సదరు యువతే ఆ పోస్టు పెట్టిందని భావించి, ఆకర్షితులైనవారు ఇన్‌స్ట్రాగామ్‌లోనే సందేశాలు పంపించేవారు. సంప్రదింపులు, చాట్‌ చేయాలంటే కొంత మొత్తం డిపాజిట్‌ చేయాలంటూ అతగాడు తన గూగుల్‌ పే ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఇది నమ్మిన ఎంతో మంది రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించారు. ఆపై కొన్ని రోజులు వారితో యువతి మాదిరిగా చాటింగ్‌ చేసే అతగాడు ఆపై వదిలేసేవాడు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ప్రతి నెలా తన సెల్‌ఫోన్‌ నంబర్‌ మారుస్తూ, కొత్త ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా ఓపెన్‌ చేస్తూ వచ్చాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ దందా చేసిన అతగాడు రెండు నెలల క్రితం హఠాత్తుగా అదృశ్యమయ్యాడు.  

విషయం తెలిసి అవాక్కైన యువతి..  
తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన అతడి కోసం సదరు యువతి అనేక ప్రాంతాల్లో ఆరా తీసింది. ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైంది. ఈ నేపథ్యంలో.. సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో తన ఫొటో, పేరుతో కొన్ని ఖాతాలు ఉన్నాయని, కొన్నింటిలో అభ్యంతరకర, అశ్లీల చాటింగ్స్‌ ఉన్నట్లు ఇటీవల ఆ యువతికి తెలిసింది. దీంతో అవాక్కైన ఆమె తనను ‘గాంధర్వ వివాహం’ చేసుకున్న యువకుడి పనిగా నిర్ధారణకు వచ్చింది. ప్రతి నెలా తన సెల్‌ఫోన్‌ నంబర్‌ మారుస్తున్నాడని గుర్తించింది. దీంతో గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు