పెట్టుబడి రెండింతలు పేరిట మోసం

20 May, 2019 08:37 IST|Sakshi

అమెరికా కంపెనీ అని నమ్మించి వసూళ్లు 

ఐదుగురిపై కేసు  

రసూల్‌పురా: అమెరికాకు చెందిన ట్రేడింగ్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతిరోజూ డాలర్లతో పాటు సంవత్సరం తరువాత పెట్టిన పెట్టుబడికి రెండింతలు వస్తుందని పలువురిని నమ్మించి లక్షలాది రూపాయలను దండుకుని పరారీలో ఉన్న  ఐదుగురి పై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజేష్‌ తెలిపిన మేరకు.. కరీంనగర్‌ జిల్లా నందగిరి కొట్టాల గ్రామానికి చెందిన నాగమళ్ళ వెంకటేశంతో అదే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన గర్దాస్‌ రమేష్, సుధగోని సత్తయ్యగౌడ్, చందుపట్ల శ్రీనివాస్, కుంచాల హరిగౌడ్‌లు ముఠాగా ఏర్పాడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని తమకు పరిచయం వున్నవారిని కలసి అమెరికాకు చెందిన కాన్కŠస్‌ ట్రేడింగ్‌ కంపెనీలో మూడు లక్షలా 80వేల రూపాయలను పెట్టుబడి పెడితే ప్రతి రోజు 45 డాలర్ల చొప్పున 223 రోజులు కంపెనీ చెల్లిస్తుందని నమ్మించారు.అంతేకాక సంవత్సరం తర్వాత పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం వస్తుందని నమ్మ బలికారు.

ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం నగరంలోని బోయిన్‌పల్లిలో ఉందని చెప్పారు. సంస్థకు సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా చూపించారు. గతేడాది కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పలువురి వద్ద డబ్బు వసూలు చేశారు. అనంతరం మొహం చాటేయడంతో బాధితులు బోయిన్‌పల్లిలో ఉన్నట్లు తెలుసుకుని కరీంనగర్‌ జిల్లా మానకొండురుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి వంగాల కరుణాకర్‌తో పాటు మరో 20 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిపై ఇదివరకే సంగారెడ్డి, మియాపూర్, చిక్కడపల్లి, సిద్దిపేట ఇతర ప్రాంతాల్లో ఒక్కొక్కరిపై 8 నుంచి పది కేసులు నమోదైనట్లు సీఐ రాజేష్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు