మెడికల్‌ సీటు ఇప్పిస్తానని ‘నీట్‌’గా మోసం

20 Sep, 2019 09:57 IST|Sakshi

ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించారు

మెడికల్‌ సీటు ఇప్పిస్తానని రూ.5 లక్షలు కాజేశారు

గారడీ మాటలకు మోసపోయిన విద్యావంతుడు

జిల్లాలో మొదటి సైబర్‌ క్రైం కేసు పీటీఎంలో నమోదు

సాక్షి, పెద్దతిప్పసముద్రం(చిత్తూరు): సైబర్‌ నేరగాళ్ల గారడి మాటలకు, నకిలీ వెబ్‌సైట్‌లకు గ్రామీణ ప్రాంత అమాయకులే కాదు, చదువుకున్న విద్యావంతులు సైతం మోసపోతున్నారు. మండలంలోని టి.సదుం పంచాయతీ ఎరబల్లికి చెందిన రవితేజ అనే విద్యావంతుడు సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాకు రూ.5 లక్షల నగదు జమచేసిన అనంతరం తాను మోసపోయానని గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. పూర్వాపర వివరాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు తక్షణం కేసు నమోదు చేయాలని స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లును ఆదేశించారు.

జిల్లాలోనే మొట్టమొదటి సైబర్‌ క్రైం కేసును పీటీఎంలో నమోదుచేశారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎరబల్లికి చెందిన అంకిరెడ్డి వెంకట్రమణ కుమారుడు ఏ.రవితేజ ఇంటర్‌ పాసయ్యాడు.  ‘నీట్‌’ ఫలితాల్లో 474 మార్కులతో 53 వేల ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నీరజ్‌ మెహతా (సైబర్‌ నేరగాడు) ‘ఢిల్లీ మెడికల్‌ కౌన్సిల్‌ ఎడ్యుకేషన్‌’ పేరిట నకిలీ వెబ్‌ సైట్‌ సృష్టించి ఆన్‌లైన్‌లో పొందుపరిచాడు. అనంతరం రవితేజకు ఫోన్‌చేసి కోల్‌కతా మెడికల్‌ కళాశాలలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. అందులో లేబర్‌ డిపార్ట్‌మెంటుకు 22 సీట్లు కేటాయించామని, దరఖాస్తు చేసుకుంటే మేనేజ్‌మెంటు కోటా ద్వారా సీటు ఇప్పిస్తామని నమ్మబలికాడు. సదరు అప్లికేషన్‌ ఫారం ఆన్‌లైన్‌లో పంపిస్తున్నామని, బయోడేటా పూర్తిచేసి పంపాలని చెప్పాడు.

అనంతరం అప్లికేషన్‌ అప్రూవల్‌ అయిందని రూ.45 వేలు చెల్లిస్తే దరఖాస్తు నిర్దారిస్తామని సూచించాడు. గత నెల 13న రవితేజ సొమ్మును ఫోన్‌పే ద్వారా జమ చేసాడు. మళ్లీ అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి మెడికల్‌లో సీటు కోసం రూ.9 లక్షలు రెండు విడతలుగా చెల్లించాలని సూచించాడు. మొదటి విడతగా  ‘డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ శర్మ ఎస్‌బీఐ ఖాతా నంబర్‌–1178301818, న్యూ ఢీల్లీ’ పేరిట బి.కొత్తకోట బ్యాంకు ద్వారా రూ.4.50 లక్షల సొమ్ము జమచేసాడు. 14వ తేదీన తిరిగి మళ్లీ ఫోన్‌చేసి మెడికల్‌ సీటు ఖాయమైందని, మిగిలిన సొమ్ము జమ చేయమన్నాడు. దీంతో రవితేజ కళాశాలకే వచ్చి నగదు చెల్లిస్తామని సమాధానం ఇచ్చారు. 

చదవండి : ఏటీఎం కార్డులు మార్చడంలో ఘనుడు

అనంతరం ఢిల్లీకి వెళ్లి ఆరా తీస్తే ఫేక్‌ ఐడీల ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి మోసాలు చేస్తుంటారని తెలుసుకున్నాడు. బాధితులు కంగుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, మచిలీపట్నం, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎంతోమంది విద్యావంతులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయినట్లు గుర్తించారు. తాము మోసపోయిన వైనంపై జిల్లా ఎస్పీకి రవితేజ తండ్రి అంకిరెడ్డి వెంకట్రమణ ఫిర్యాదు చేశాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా