టవరంటూ టోకరా!

16 Jul, 2018 10:49 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జియో ఫోన్లకు సంబంధించిన టవర్‌ ఏర్పాటుకు అనుమతి ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తికి సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. కిషన్‌బాగ్‌కు చెందిన వ్యాపారి అబ్దుల్‌ సయ్యద్‌కు గత నెల 27న అజయ్‌ షా అనే వ్యక్తి ఫోన్‌ వచ్చింది. మీ ఇంటి ఆవరణలో జియో టవర్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇప్పిస్తామని నెలనెలా భారీ మొత్తం అద్దె వస్తుందని చెప్పాడు. ఇందుకు అబ్దుల్‌ అంగీకరించడంతో సైబర్‌ నేరగాళ్లు రిలయన్స్‌ సంస్థ పేరుతో కొటేషన్‌ పంపారు.

ఇది నిజమని నమ్మిన బాధితుడితో రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరు చెప్పి రూ. 14,500 తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు. ఆపై ఒప్పందం ఖరారంటూ మరికొన్ని పత్రాలను ఈ–మెయిల్‌ చేసి అగ్రిమెంట్‌ ఛార్జీల పేరు చెప్పి మరో రూ.52,500 కాజేశారు. ఇంకోసారి డిక్లరేషన్‌ ఫామ్‌ పేరు చెప్పి ఇంకో రూ.35,200 వసూలు చేశారు. మొత్తం రూ. 1,02,200 కోల్పోయిన బాధితుడిని నేరగాళ్లు మరో రూ.55,500 డిపాజిట్‌ చేయమన్నారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు