సైబర్‌ ఫ్రాడ్స్‌..బీ అలర్ట్‌!

10 Feb, 2020 10:19 IST|Sakshi

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

సోషల్‌ మీడియా ప్రైవసీసెట్టింగ్స్‌ ఉపయోగించు కోవాలని సూచన

వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి

అపరిచితులకు ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ ఐడీలు ఇవ్వొద్దు

మృతిచెందిన ఐటీ ఉద్యోగుల పేరుతో రుణాలు పొందిన వైనంపై చర్చ

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి ఖాతాదారుడి బ్యాంక్‌ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు...ఇప్పుడూ పంథా మార్చి చచ్చిన వాళ్లను కూడా వదలడం లేదు. వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలుసుకుని మోసపూరిత విధానంలో రుణాలు పొందిన విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందనే లోతుల్లోకి వెళితే..మృతుడి దగ్గరి నుంచి అతడు పనిచేసిన కార్యాలయం, మొబైల్‌ స్టోర్, బ్యాంకు కార్యాలయం..ఇలా అన్నీచోట్లా చేసిన చిన్న చిన్న తప్పిదాలే లక్షల్లో డబ్బులు స్వాహాకు కారణమయ్యాయని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐటీ ఉద్యోగుల జీతం భారీగా ఉండటం, వారికి రుణాలు సులభంగా మంజూరుకు సిబిల్‌ స్కోరు బాగుండడంతో వీరిపై కన్నేసిన నేరగాళ్లు ప్రతిరోజూ దినపత్రికలు చదివేవారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తూ మరణించిన ఐటీ ఉద్యోగుల వార్తలు చదివి ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వారి పేరుతో ప్రొఫైల్స్‌ వెతికి వ్యక్తిగత, కెరీర్‌ వివరాలు తెలుసుకునేవారు.

ఒకవేళ ఆ ప్రొఫైల్స్‌లో మృతుడి సెల్‌నంబర్‌ దొరకకపోతే, వారి కార్యాలయానికో, లేదంటే మృతుడు చికిత్స పొందిన ఆసుపత్రి వద్దకు వెళ్లి ఏదో కారణం చెప్పి ఆ సెల్‌నంబర్‌ దొరకబుచ్చుకునేవారు. ఆ తర్వాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, డూప్లికేట్‌ సిమ్‌లు పొంది బ్యాంకుల నుంచి ప్రీ అప్రూవ్డ్‌ లోన్లు, క్రెడిట్‌ కార్డులు పొందేవరకు ఎక్కడా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన ప్రమాదాల్లో మరణించిన ఐటీ ఉద్యోగుల వార్తలను దినపత్రికల్లో చదివి సోషల్‌ మీడియాలో శోధించి రూ.53,95,043 కొల్లగొట్టిన ఆరుగురు సభ్యులతో కూడిన ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగులే కాకుండా ప్రతిఒక్కరూ సైబర్‌ నేరాలబారిన పడకుండా జాగ్రత్తపడాలని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.  

ఇలా చేస్తే ఎంతో బెటర్‌...
సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎవరితో షేర్‌ చేయవద్దు. ఒకవేళ ఉన్నా అందరికీ కనబడకుండా ప్రైవసీ సెట్టింగ్స్‌ చేసుకోవచ్చు.
గూగుల్‌లో ఒకటికి రెండుసార్లు వ్యక్తిగత వివరాలు ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే అర్కుట్, గూగుల్‌ ప్లస్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌...ఇలా ఏదైనా ఎక్కడా ఒక్కదాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్‌ సెట్‌ చేసుకోకపోవడం వల్ల ఆ వివరాలు ఇతరులకు తెలిసే అవకాశముంది.
అపరిచితులకు స్నేహితుల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ ఐడీలు చెప్పొద్దు
ఆయా కంపెనీలు కూడా తమ ఉద్యోగుల వివరాలు ఇతరులెవరికీ చెప్పొద్దు
సరైన తనిఖీ లేకుండా టెలికామ్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ డూప్లికేట్‌ సిమ్‌ కార్డులు ఇవ్వొద్దు

ఖాతాదారుడు మరణిస్తే బ్యాంక్‌కు తెల్పాలి..
మరణించిన ఐటీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలతో సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు, లేదంటే మృతుడి కుటుంబ సభ్యులు ఖాతాదారు మరణించిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలపాలి. ఇలా చేయడం వల్ల ఆ ఖాతాలపై అధికారుల నిఘా ఉండి ప్రీ అప్రూవ్డ్‌లోన్‌లు, క్రెడిట్‌కార్డుల రుణాల మోసం జరిగేందుకు అస్కారముండదు.ఒకవేళ ఎవరైనా వచ్చి వాకబు చేసినా అపరిచితులైతే ఇట్టే దొరికే అవకాశముంటుంది. అలాగే బ్యాంక్‌ ఖాతా నంబర్, కస్టమర్‌ ఐడీ, ఈ మెయిల్‌ ఐడీ ఎవరికీ పడితే వారికి బ్యాంక్‌ సిబ్బంది చెప్పొద్దు. వివరాలు అడిగే వ్యక్తి సరైనోడా, కాదా అని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతరుల క్రెడిట్, డెబిట్‌ కార్డులను పొందుతున్న మోసగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే ఆన్‌లైన్‌లో క్రెడిట్, డెబిట్‌ కార్డుల జారీకి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంక్‌ సిబ్బందికి మోసాలపై అవగాహన కలిగించాలి. ఇలా అప్రమత్తతో సైబర్‌ నేరాలు జరగకుండా నియంత్రించే అవకాశముంటుందని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

మరిన్ని వార్తలు