నెక్ట్స్‌... కీరవాణి!

21 Feb, 2018 02:13 IST|Sakshi
మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి

‘జీఎస్టీ’కేసులో నోటీసులు ఇవ్వనున్న సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : వివాదాస్పద అశ్లీల వెబ్‌ సిరీస్‌ ‘జీఎస్టీ’పై నమోదైన కేసుకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయనతో పాటు ఆ సిరీస్‌కు సంబంధించి పని చేసినట్లు అనుమానిస్తున్న ప్రతి ఒక్కరినీ విచారించాలని నిర్ణయించారు. ప్రధానంగా ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌ వర్మకు ఉన్న సంబంధాల పైనే ఆరా తీయనున్నట్లు తెలిసింది.

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’(జీఎస్టీ) సినిమా తీశారని, దాని ప్రసారాన్ని నిలిపివేయాలని, సినిమా తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్‌వర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం విదితమే. దర్యాప్తులో భాగంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత శనివారం వర్మను సుదీర్ఘంగా విచారించారు. సోషల్‌ మీడియాలో వర్మ చేసిన పోస్టులు.. కొన్ని మీడియా చానళ్లతో ఆయన మాట్లాడిన అంశాలను పరిశీలించిన పోలీసులు వర్మ చెప్తున్న అంశాల్లో పూర్తి వాస్తవాలు లేవని అనుమానిస్తున్నారు.

దీంతో సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతని ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి పని చేసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు ప్రశ్నించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కీరవాణికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. శుక్రవారం వర్మ మరోసారి సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో ఈలోపే కీరవాణి సహా మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు