తెరవెనుక దొంగలు

30 Jan, 2018 08:17 IST|Sakshi

పెరుగుతున్న సైబర్‌ మోసగాళ్లు

ఓటీపీలతో ఝలక్‌

లక్షలు పోగొట్టుకుంటున్న అమాయకులు

జాగ్రత్త లేకుంటే ఖాతా ఖాళీ

నేడు శాస్త్ర సాంకేతిక రంగం పరుగులు పెడుతోంది. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని కొందరు నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు దిగుతున్నారు. అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు తిరుపతి క్రైం పోలీసు స్టేషన్‌ పరిధిలో అధికమవుతున్నాయి. ఇప్పటికే 35 మందికి పైగా ఆన్‌లైన్‌ మోసాల బారిన పడ్డారు. పోలీసు స్టేషన్లకు చేరుకుని లబోదిబోమంటున్నారు.  

తిరుపతి క్రైం: నైజీరియన్లతోపాటు మరికొందరు విదేశీయులు వీసాపై ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా వంటి మెట్రో నగరాలకు చేరుకుంటున్నారు. అక్కడ లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని స్థానికంగా ఉన్న కొందరితో ఆపరేషన్‌ చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా తెప్పించుకున్న ఈమెయిల్‌ అడ్రస్‌లతోపాటు, మొబైల్‌కు మెసేజ్‌ పంపుతున్నారు. ఇందులో లాటరీ వచ్చిందని ఆశలు రేపుతున్నారు. దీంతో స్పందించిన అమాయకులు తమ బ్యాంకు ఖాతా నెంబర్, ఏటీఎం, పిన్, ఓటీపీ నెంబర్‌ చెబుతున్నారు. దుండగులు ఆయా నగరాల నుంచే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్‌ నేరగాళ్లు అనేక విధాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు అర్బన్‌ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మొహంతి ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్‌లు వేశాం. ప్రజలకు అవగాహన కలిగేలా సైబర్‌ క్రైంపై ప్రచారం చేస్తున్నాం. తప్పుడు ప్రకటనలు, నిరుద్యోగులు, మాయలేడీల వలలో పడకండి. లాటరీ వచ్చిందని డబ్బులు కడితే ఇంటికి వస్తాయని నమ్మి మోసపోకండి.  – క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి

ఆన్‌లైన్‌లో మోసాలు ఇలా
ఓ యువకుడికి అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. పలానా కంపెనీ నుంచి నగదును తమ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నామని అవతలి వ్యక్తి తెలిపాడు. నీకు పంపిన పాస్‌వర్డ్‌ చెప్పాలని కోరాడు. ఆ యువకుడు పాస్‌వర్డ్‌ చెప్పిన వెంటనే తన అకౌంట్‌లో ఉన్న రూ.26 వేలు అతని అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అయిపోయింది.
తిరుపతికి చెందిన ఒక యువకుడికి పేస్‌బుక్‌లో ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి తనకు నగదు ఇవ్వాలని, మళ్లీ ఇస్తానని చెప్పి రూ.వేలు కాజేసింది. తర్వాత ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితుడు క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
క్విక్కర్, ఓఎల్‌ఎక్స్‌ సంస్థలను సైతం సైబర్‌ నేరగాళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వస్తువులను పెట్టి తక్కువ ధరలకే విక్రయిస్తామని చెబుతున్నారు. అలా ఆశపడ్డ వ్యక్తి అకౌంట్‌లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్నారు.
బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్‌ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఒకసారి మీ అకౌంట్‌ నెంబర్‌ చెప్పండి అని తెలిపి అకౌంట్‌ నెంబర్‌ తెలుసుకుని పాస్‌వర్డ్‌ పంపుతారు. పాస్‌వర్డ్‌ పంపితే ఆధార్‌ కార్డు అనుసంధానం అవుతుందని నమ్మబలుకుతారు. అలా చెప్పిన వెంటనే అకౌంట్‌లోని డబ్బులను వారి అకౌంట్‌కు బదిలీ చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు సైతం నగరంలో అధికంగానే నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు