చారిటీ పేరుతో అడ్డంగా బుక్కైన నైజీరియన్‌ ముఠా

29 Jan, 2020 13:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాన్ని సైబర్‌ క్రైం పోలీసులు అడ్డుకున్నారు. చారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరైస్టైన వారిలో నలుగురు నైజీరియన్లతో పాటు మేఘాలయకి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలు.. విశాఖపట్నంలో నివసిస్తున్న సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక నైజీరియన్‌ సంస్థ నుంచి రూ.39 కోట్ల తమ ఆస్తిని ఇండియాలో చారిటీ కోసం వినియోగించనున్నామంటూ మెయిల్‌ వచ్చింది. మీరు కూడా మీ వంతు సాయం చేయాలనుకుంటే అకౌంట్‌కు డబ్బు పంపించవచ్చంటూ అందులో పేర్కొంది. దీంతో మెయిల్‌కు స్పందించిన సంజయ్‌ సింగ్‌ తన వ్యక్తిగత వివరాలను పంపించాడు. దీంతో కస్టమ్స్‌,లీగల్‌ ఫార్మాలిటీస్‌ పేరుతో సంజయ్‌ సింగ్‌ వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుంజడానికి ప్రయత్నించింది.

ఈ నేపథ్యంలో నైజీరియన్‌ ముఠా వలలో చిక్కుకున్న సంజయ్‌ రూ. 6.62 లక్షల రూపాయలను వివిధ అకౌంట్లకు పంపించాడు. తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సంజయ్‌ సింగ్‌ విశాఖ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నైజిరీయన్‌ ముఠాను ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. కాగా వీరికి సహకరించిన మేఘాలయ రాష్ర్టానికి చెందిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నైజీరియన్‌ ముఠా నుంచి 55 వేల నగదు, రెండు లాప్‌టాప్‌లు, ఆరు మొబైల్‌ ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు, రెండు ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు, వారి బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.46 లక్షల నగదును సీజ్‌ చేసనట్లు పోలీసులు వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు