వాట్సప్, ఫేస్‌బుక్‌లతో అమ్మాయిలకు వల

5 Sep, 2018 14:01 IST|Sakshi
విలేకర్ల సమావేశంలో వివరాలు తెలియజేస్తున్న డీఎస్పీ రవివర్మ అమ్మాయిలను మోసం చేస్తున్న వంశీకృష్ణ

లక్షల రూపాయలకు టోపీ

అంతర్రాష్ట్ర మాయగాడి అరెస్టు

తూర్పుగోదావరి, కాకినాడ రూరల్‌: సోషల్‌ మీడియాలో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వారికి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలు కాజేశాడు. కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బురిడీ కొట్టించాడు. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారికి టోకరా ఇచ్చిన అంతర్రాష్ర ్ట మాయగాడిని కాకినాడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 1.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ రవివర్మ, టూటౌన్‌ సీఐ ఎండీ ఉమర్‌తో కలసి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట, 2వ వీధికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్‌ హర్ష (28) 2009లో సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌లో చేరాడు. 2013 వరకూ చదివి మధ్యలో మానేశాడు. 2014లో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేట్‌ కంపెనీలో చేరి కొంతకాలం పనిచేసి మానేశాడు. జల్సాలకు అలవాటుపడిన వంశీకృష్ణ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారి ద్వారా మరికొందరు అమ్మాయిలను పరిచయం చేసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ. 80 లక్షల వరకూ వసూలు చేశాడు. అతని మోసాన్ని గమనించి వారు పోలీసు కేసులు పెట్టగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.     

జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. అందులో తన ఫొటోకు బదులుగా మిత్రుడు హర్ష ఫొటోను ఉంచి అమ్మాయిలను ట్రాప్‌ చేసేవాడు. వారితో వ్యక్తిగత పరిచయాలు పెంచుకొని వారి వివరాలను తెలుసుకొని వాట్సప్‌ ద్వారా వారి మిత్రులతో పరిచయం పెంచుకొనేవాడు. వారి నుంచి రూ. 2 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 5 లక్షలు తీసుకుంటూ ఆ డబ్బుతో క్రికెట్‌ బెట్టింగ్, గుర్రప్పందాలు ఆడుతూ జల్సా చేశాడు. అలా రూ. 44 లక్షలు దోచేశాడు. అలాగే రంVýæరాయ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని ఆరు నెలల క్రితం మోసం చేసి రూ. 70 వేల నగదు, ఐదున్నర కాసుల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. దాంతో ఆమె కాకినాడ టూటౌన్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  దాంతో అప్పటి నుంచి పోలీసులు వంశీకృష్ణ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ ఆరునెలల్లో అతను 25 సిమ్‌ కార్డులను మార్చి తప్పించుకు తిరిగాడు. చివరకు టౌన్‌రైల్వే స్టేషన్‌ వద్ద మంగళవారం 11 గంటలకు వంశీకృష్ణను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు.

ముద్దాయి వంశీకృష్ణపై హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్, ఖమ్మం టూటౌన్, నిజామాబాద్‌ వన్‌టౌన్, భీమవరం టౌన్, పాలకొల్లు టౌన్, ఆకివీడు, మహబూబ్‌నగర్, కాకినాడ టూటౌన్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్, కైకలూరు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అమ్మాయిలను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచేసిన ముద్దాయి వంశీకృష్ణపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరుస్తామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఇటువంటి నేరాలు తరచూ జరుగుతున్నాయని వాట్సప్,ఫేస్‌బుక్‌ల్లో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని,  వ్యక్తిగత వివరాలు, ఫొటోలు తెలియని వ్యక్తులకు ఇవ్వవద్దని డీఎస్పీ రవివర్మ సూచించారు. వంశీకృష్ణను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ఉమర్, ఎస్సై జీవీవీ సత్యనారాయణ, ఏఎస్సై పట్టాభి, హెచ్‌సీ నూకరాజు, రమేష్, కానిస్టేబుల్‌ నూకరాజులను డీఎస్పీ రవివర్మ అభినందించారు.

మరిన్ని వార్తలు