బెదిరింపులు..బేరసారాలు

4 Jul, 2019 05:51 IST|Sakshi
వినోద్‌కుమార్‌

ఘరానా సైబర్‌ నేరగాడికి అరదండాలు

300 మంది మహిళలు, యువతులకు నరకం

స్వయంగా సోషల్‌మీడియాలో అసభ్య చిత్రాల అప్‌లోడ్‌  

తొలగిస్తానంటూ బాధితులతో బేరసారాలు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాతో పాటు టీవీ చానళ్లలో జరిగే ప్రసారాల ఆధారంగా మహిళల ఫోన్‌ నంబర్లు సేకరిస్తాడు... వీటిని అనుకూలంగా మార్చుకుని ఆన్‌లైన్‌ మార్గాల్లో వారి ఫొటోలను సంగ్రహిస్తాడు... వాటిని మార్ఫింగ్‌ చేసి మళ్లీ సోషల్‌మీడియాలోనే పెడతాడు... బాధితులను సంప్రదించడం ద్వారా ఎవరో పెట్టిన వాటిని తాను తొలగిస్తానంటూ బేరసారాలు చేసి డబ్బు గుంజుతాడు. దీంతో పాటు చాటింగ్‌ ద్వారానూ దాదాపు 300 మందిని మోసం చేసిన ఘరానా సైబర్‌ నేరగాడు పడి వినోద్‌కుమార్‌ను సీసీఎస్‌ ఆధీనంలోని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ బుధవారం తెలిపారు. విశాఖపట్నంలోని సత్యన నగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌ సందీప్, ప్రవీణ్‌ అనే పేర్లతోనూ చెలామణి అయ్యాడు. కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివినా హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌ల్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం అక్కడే ఓ సెల్‌ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు చెందిన స్టోర్‌లో పని చేస్తున్నాడు. ఇతడికి సోషల్‌మీడియాపై మంచి పట్టుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, లింక్‌డిన్‌ తదితర యాప్స్‌తో పాటు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా మహిళలు, యువతుల ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీలు సంగ్రహిస్తాడు. ఇటీవల కాలంలో అనేక టీవీ కార్యక్రమాలకు అతిథులుగా వస్తున్న వారు సందేహాలు ఉన్నా, సహాయం కావాలన్నా సంప్రదించాలంటూ తమ ఫోన్‌ నంబర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.

వినోద్‌ కొన్ని సందర్భాల్లో ‘ట్రూ కాలర్‌’ యాప్‌ ద్వారానూ నెంబర్లు తెలుసుకుంటున్నాడు. ఇతను వివిధ మార్గాల్లో బోగస్‌ పేర్లు, వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుని సిద్ధంగా ఉంచుకుంటున్నాడు. ఈ నంబర్లను వినియోగించి ఆయా ప్రముఖుల నెంబర్లకు అనేక కారణాలు చెప్తూ కాల్‌ చేయడం ద్వారా వారివే అని నిర్థారించుకుంటున్నాడు. ఆపై సోషల్‌మీడియాతో పాటు డీపీల నుంచి వారి ఫొటోలు సేకరిస్తాడు. అసభ్యకర ఫొటోలతో వీటిని మార్ఫింగ్‌ చేసి కొన్ని సైట్లలో పెట్టేస్తాడు. వారి ఫోన్‌ నెంబర్లను సైతం ఫోర్న్, డేటింగ్‌ సైట్స్‌లో పొందుపరుస్తుంటాడు. ఇతడి బారినపడుతున్న వారిలో అత్యధికులు ధనికులు, ప్రముఖులే ఉంటున్నారు. వినోద్‌ చేసిన దుశ్చర్యతో ఆ ప్రముఖులకు అనవసర ఫోన్‌కాల్స్‌తో పాటు ఇతర ఇబ్బందులు మొదలవుతాయి. ఆపై మరోసారి వారిని సంప్రదించే వినోద్‌ తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌నని, ఐటీ ఎక్స్‌పర్ట్‌ అని పరిచయం చేసుకున్నాడు. దుర్వినియోగమైన ఫొటోలను ఆన్‌లైన్‌ నుంచి తొలగిస్తానంటూ చెప్పి వారి నుంచి డబ్బు వసూలు చేసి విడతల వారీగా వాటిని తీసేస్తాడు. ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే వారి ఫొటోలను మళ్లీ ఆయా సైట్స్‌లో పెట్టేస్తాడు.

నగరానికి చెందిన ఓ ప్రముఖురాలి ఫొటోలు, నెంబర్‌ను ఇలానే చేసిన వినోద్‌ ఆమెకు ఫోన్‌ చేసి తాను సిస్కో, డెల్‌ సంస్థలకు సెక్యూరిటీ ఇంజినీర్‌ అని పరిచయం చేసుకున్నాడు. సదరు ఫొటోలను తొలగిస్తానంటూ ఆమె నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున నాలుగు నెలలు వసూలు చేసిన అతగాడు వాటిని తానే తొలగించాడు. ఆపై ఆమె డబ్బు చెల్లించడం ఆపేయడంతో మళ్లీ మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీయగా వినోద్‌ వ్యవహారం అనుమానాస్పదంగా తేలింది. దీంతో ఆమె సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు.  విశాఖపట్నంలో అతడిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. విచారణ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడే ఇతడు తన ఉనికి బయటపడకుండా అనేక రహస్య యాప్స్‌ వాడినట్లు తేలింది. వివిధ యాప్స్‌ ద్వారా అనేక మంది యువతులు, మహిళలతో చాటింగ్‌ చేసిన ఇతగాడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని అంటూ నమ్మించాడని వెలుగులోకి వచ్చింది. వారినీ వివిధ రకాలుగా బ్లాక్‌మెయిల్స్‌ చేసి డబ్బు గుంజాడు. ఇతడిపై విశాఖపట్నంలోనూ ఓ కేసు నమోదైంది. వినోద్‌ ఇప్పటి వరకు దాదాపు 300 మందిని మోసం చేసి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన ఇతడిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.  కస్టడీకి అనుమతి కోరుతూ త్వరలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు