మోసగాళ్లలో స్పూఫర్లు!

24 Feb, 2020 11:18 IST|Sakshi

ఓపక్క ఫోన్‌ కాల్స్‌.. మరోపక్క ఈ–మెయిల్స్‌

నిరుద్యోగులను నమ్మించేందుకు వినియోగం

అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌సాయంతో వ్యవహారం

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ‘స్ఫూఫింగ్‌’(నకిలీల సృష్టి) టెక్నాలజీ ఇప్పుడు మోసగాళ్ల వద్దకూ చేరింది. కేవలం కాల్‌ స్ఫూఫింగ్‌ మాత్రమే కాకుండా మెయిల్‌ స్ఫూఫింగ్‌కూ పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. నిరుద్యోగుల్ని బురిడీ కొట్టించి అందినకాడికి దండుకుంటున్నారు. ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్‌ చేసే వారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్‌ కాల్స్‌ అన్నీ మీ నెంబర్‌ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్‌ మొబైల్‌ సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఈ) నెంబర్‌ తెలిసి ఉండటం తప్పనిసరి. దీన్ని తెలుసుకోవడంఅందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్‌ చోటు చేసుకున్నాయి. ఈ విధానాన్ని తలదన్నేదిగా ఇంటర్‌నెట్‌లో అందుబాటులోకి వచ్చిందే స్ఫూఫింగ్‌.

గతంలో కేవలం ఫోన్‌ కాల్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ విధానం ఇప్పుడు ఈ–మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ) అడ్రస్‌నూ స్ఫూఫ్‌ చేయగలుగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్‌ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్‌నెట్‌ ద్వారా చేసే కాల్‌. దీనిలోకి ఎంటర్‌ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్‌ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్‌ రిసీవ్‌ చేసుకునేప్పుడు ఇతడికి సెల్‌ఫోన్‌లో ఎవరి నెంబర్‌ డిస్‌ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదే రకంగా ఈ–మెయిల్‌ ఐడీ స్ఫూఫింగ్‌ వెబ్‌సైట్లలో మెయిల్‌ ఐడీలను రిజిస్టర్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్‌ చేసినట్లు, ఈ–మెయిల్‌ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్ఫూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా వినియోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు.

ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ముందు ప్రకటనలు జారీ చేయడం ద్వారా నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి నుంచి బయోడేటా తదితరాలు సేకరించిన తరవాత ఫోన్‌ ఇంటర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్‌ నెంబర్‌కు స్ఫూఫింగ్‌ చేయడం ద్వారా వారే కాల్‌ చేసినట్లు సృష్టిస్తున్నారు. ఉద్యోగార్థి అనుమానం వచ్చి ఆ ఫోన్‌ నెంబర్‌ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీకి చెందిన మెయిల్‌ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్‌ చేస్తున్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్, ఆఫర్‌ లెటర్‌ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుంచి వచ్చినట్లే ఉంటుంది. దీంతో సదరు నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్‌ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్‌ వివరాలతో ఓపెన్‌ చేసినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే మోసగాళ్లు వీరికి ముందే తామకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్‌ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తారు. దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది.

కనిపెట్టడం కష్టమే
సంక్షిప్త సందేశాలను సైతం స్ఫూఫ్‌ చేయవచ్చు. ఈ తరహా స్ఫూఫ్డ్‌ కాల్స్, ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌ల మూలాలను కనిపెట్టడం కష్టమే. ఇలాంటి వాటిని వినియోగించి బెదిరింపులకు పాల్పడటం, వేధింపులకు దిగడం కూడా జరుగుతోంది. ఈ కాల్స్, మెయిల్స్‌ అందించే వెబ్‌సైట్స్‌ అన్నీ వివిధ మారుమూల దేశాల్లోని సర్వర్ల నుంచి హోస్ట్‌ అయి ఉంటాయి. ఆ సర్వర్ల నిర్వాహకులు, వెబ్‌సైట్స్‌ హోస్ట్‌ చేసిన వారి వివరాలు కోరుతూ ఆయా దేశాల్లో సంబంధిత విభాగాలకు లేఖలు రాయడం, వారి నుంచి జవాబు పొందడం ఓ పెద్ద ప్రహసనం. ఈ తంతు పూర్తి చేసినప్పటికీ వారు స్పందించి వివరాలు అందించడం దుర్లభం.– సైబర్‌ క్రైమ్‌ పోలీసులు   

మరిన్ని వార్తలు