జవాన్‌కు రూ.1.5 లక్షల టోకరా!

5 May, 2020 07:55 IST|Sakshi

స్నేహితుడి ఫేస్‌బుక్‌ ఐడీ హ్యాక్‌ చేసి మోసం

మరో ముగ్గురి నుంచి రూ. 2.2 లక్షలు స్వాహా

కేసులు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆర్మీ సిపాయితో ఆయన స్నేహితుడి మాదిరిగా చాట్‌ చేసిన నేరగాళ్లు రూ.1.5 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క వేర్వేరు నేరాల్లో రూ.2.23 లక్షలు కోల్పోయిన మరో ముగ్గురు బాధితులూ సైబర్‌ ఠాణాను ఆశ్రయించారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో నివసించే ఆర్మీ సిపాయి రాహుల్‌ తన స్నేహితుడైన మనోజ్‌ గుప్తతో తరచుగా ఫేస్‌బుక్‌ ద్వారా చాటింగ్‌ చేస్తుండేవారు. ఇది గమనించిన సైబర్‌ నేరగాళ్లు మనోజ్‌ గుప్త ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేశారు. అతడి అనుమతి లేకుండానే అందులో ప్రవేశించి, రాహుల్‌తో చాటింగ్‌ కొనసాగించారు.

అప్పటి వరకు వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు అదే పంథా కొనసాగించారు. ఓ సందర్భంలో తనకు అత్యవసరంగా రూ.1.5 లక్షలు కావాలంటూ మనోజ్‌ మాదిరిగా సైబర్‌ నేరగాళ్లు రాహుల్‌ని కోరారు. ఇలా అడిగింది మనోజే అని భావించిన రాహుల్‌ తన వద్ద ప్రస్తుతం రూ.లక్ష మాత్రమే ఉందని, దాన్ని పంపిస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో మనోజ్‌ మాదిరిగా సైబర్‌ నేరగాళ్లు ఓ గూగుల్‌ పే నెంబర్‌ ఇచ్చారు. దీనికి రాహుల్‌ ఐదు దఫాల్లో రూ.లక్ష బదిలీ చేశారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత మనోజ్‌కు ఫోన్‌ చేసిన రాహుల్‌ డబ్బు అందిందా అని ఆరా తీశారు. డబ్బేంటి అంటూ అతడు ప్రశ్నించగా... తన ఫేస్‌బుక్‌ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌ చేసిన విషయం అతడు చెప్పాడు. దీంతోరాహుల్‌ సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మరో ఉదంతంలో రూ.1.05 లక్షలు..
వారాసిగూడ ప్రాంతానికి చెందిన సాయి అనే వ్యక్తికి హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్‌కార్డు ఉంది. ఆ బ్యాంకు నుంచి అంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు కార్డు బ్లాక్‌ అవుతోందని, అలా కాకుండా ఉండాలంటే వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని చెప్పారు. నిజమని నమ్మిన సాయి కార్డు వివరాలు, ఓటీపీ చెప్పడంతో ఖాతాలో ఉన్న రూ.1.05 లక్షలు కాజేశారు. 

కేవైసీ అప్‌డేట్‌ అంటూ...
బోరబండ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కాల్‌ చేసిన సైబర్‌ క్రిమినల్స్‌ పేటీఎం సంస్థ ప్రతినిధుల మాదిరిగా మాట్లాడారు. కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయాలంటూ ఓ లింకును పంపారు. అందులో బాధితుడు తన వివరాలు, ఓటీపీ నింపడంతో వీటి ఆధారంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.54 వేలు కాజేశారు.

క్లోన్‌ చేసి విదేశంలో షాపింగ్‌..
మరోపక్క టోలిచౌకిలో నివసించే ఓ వ్యాపారికి చెందిన క్రెడిట్‌ కార్డును దుర్వినియోగమైంది. ఇతడి కార్డును క్లోన్‌ చేసిన నేరగాళ్లు విదేశంలో రూ.64 వేలు షాపింగ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు