‘విదేశీ’ మోసం..యువతకు గాలం!

21 Sep, 2019 08:53 IST|Sakshi

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసపోతున్న నగర యువత

టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు, తప్పుడు ఆఫర్‌లెటర్లు

అందినకాడికి దండుకుంటున్న సైబర్‌నేరగాళ్లు..

ఐటీకారిడార్‌ పరిధిలో ఇటీవల 50కి పైగా కేసులు నమోదు

అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సైబర్‌ నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: విదేశీ కొలువుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు గ్రేటర్‌ యువతకు వలవేస్తున్నారు. ఇటీవల ఐటీకారిడార్‌...గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లాల పరిధిలో సుమారు 50 మంది యువత సైబర్‌నేరగాళ్ల ఉచ్చుకు చిక్కి లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా సింగపూర్, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లోని బహుళజాతి కంపెనీల్లో ఐటీ సంబంధిత ఉద్యోగాలు..లక్షల్లో వేతనాలంటూ సైబర్‌ మాయగాళ్లు నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. తొలుత టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు ఆతరవాత ఫేక్‌ ఆఫర్‌లెటర్లు, వీసాలు జారీ చేసి లక్షల్లో దండుకుంటుండడం గమనార్హం.

మోసాలు జరుగుతున్నాయిలా...
సైబర్‌నేరగాళ్లు ఐటీ, సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న ఫ్రెషర్స్‌ లక్ష్యంగా తమ పంజా విసురుతున్నట్లు సైబర్‌నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నిరుద్యోగులు దేశవ్యాప్తంగా వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగవకాశాల కోసం తమ రెజ్యూమ్‌లను షైన్‌డాట్‌కామ్, నౌక్రి.కామ్, మాన్‌స్టర్‌.కామ్, క్విక్కర్‌ డాట్‌కామ్‌ తదితర సైట్లలో అప్‌లోడ్‌చేస్తున్నారు. వీటిని ఆయా సైట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు నజరానాలు ముట్టజెప్పి రెజ్యూమ్‌లను పెద్దసంఖ్యలో కొనుగోలుచేస్తున్న ఉత్తరాది రాష్ట్రాలు, నైజీరియాకు చెందిన సైబర్‌నేరగాళ్లు ఉద్యోగార్థుల మొబైల్‌ నెంబర్లను సేకరించి వాటి ఆధారంగా వారితో కాంటాక్ట్‌ అవుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో లక్షల్లో్ల వేతనాలు చెల్లించే ఉద్యోగాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయంటూ మాయమాటలు చెబుతున్నారు. ఆ తర్వాత  టెలీఫోన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అనంతరం తమ అకౌంట్లలో రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకుడిపాజిట్‌ చేసిన తరవాత ఫేక్‌ ఆఫర్‌ లెటర్లు జారీచేస్తున్నారు. ఆ తర్వాత వీసా ప్రాసెస్‌ పేరుతో మరికొంత మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. తీరా ఉద్యోగాలు దక్కాయంటూ విదేశీబాటపట్టే సమయానికి సైబర్‌నేరగాళ్లు తమ కాంటాక్ట్‌ నెంబరును మార్చేస్తున్నారు. తీరా మోసపోయినట్లు గుర్తించిన నిరుద్యోగులు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి తమ గోడు వినిపిస్తున్నారు. ఇటీవలికాలంలో మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో ఇలాంటివే 50కి పైగా కేసులు నమోదైనట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

అప్రమత్తతే కీలకం..  
టెలిఫోన్‌ ఇంటర్వ్యూల విషయంలో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగతంగా సదరు ఆఫీసుల్లో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఒకవేళ తప్పనిసరి అయితే సదరు కంపెనీ వివరాలను నిపుణుల వద్ద ఆరా తీయాలి.
సదరు కంపెనీ వెబ్‌సైట్‌ను సంప్రదించి వాస్తవంగా ఆఫర్లు ఉన్నాయో లేదో చెక్‌చేసుకోవాలి.
బ్యాక్‌డోర్‌ ఎంట్రీని తిరస్కరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వరాదు.
సదరు కంపెనీకి సంబంధించి అందుబాటులో ఉన్న రివ్యూలను క్షుణ్ణంగా చదవాలి.
డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటే మీరు సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్లేనని భావించాలి.
డబ్బులు చెల్లించేముందు నిపుణులతో జాబ్‌ ప్రొఫైల్, సదరు కంపెనీ వివరాలపై చర్చించాలి.   
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతున్న సైబర్‌నేరగాళ్ల కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత అంశాలు షేర్‌ చేయరాదు.

మరిన్ని వార్తలు