టిండర్‌తో పరిచయం... వీచాట్‌తో చాటింగ్‌

16 Jul, 2020 07:54 IST|Sakshi

ఆపై ఫారెక్స్‌ ట్రేడ్‌ పేరుతో భారీ మోసం

హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి రూ.15 లక్షలకుపైగా టోకరా

పరారీలో ప్రధాన నిందితులు,  బ్యాంక్‌ ఖాతాలు సమకూర్చిన వ్యక్తి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: టిండర్‌ అప్లికేషన్‌ ద్వారా అపరిచితులతో పరిచయం పెంచుకొని అనంతరం వీచాట్‌ అప్లికేషన్‌తో మరింత దగ్గరై అతి తక్కువ కాలంలో ఎక్కువగా లాభాలు సంపాదించవచ్చని అమాయకులను ఫారెక్స్‌ ట్రేడ్‌ పేరుతో టోకరా వేస్తున్న సైబర్‌ నేరగాళ్లకు బ్యాంక్‌ ఖాతాలు సమకూర్చిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు చైనాకు చెందిన మైక్, హంకాంగ్‌కు చెందిన మీనా పరారీలో ఉండగా, వీరికి బ్యాంక్‌ ఖాతాలు సమకూర్చిన హైదరాబాద్‌ కొండాపూర్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌ను అదుపులోకి . వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌కు చెందిన కె.ఉమాకాంత్‌కు టిండర్‌ అప్లికేషన్‌ ద్వారా మీనాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ‘వీచాట్‌’లో చాటింగ్‌ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె ఫారెక్స్‌ ట్రేడ్‌లో పెట్టుబడులు పెట్టామని సూచించింది. దీంతో ఉమాకాంత్‌ వీ చాట్‌ అప్లికేషన్‌లో మైక్‌ను సంప్రదించగా మెటా ట్రేడ్‌4 ఖాతా ఓపెన్‌ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. జూబ్లీహిల్స్‌లోని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయాలని చెప్పడంతో అతను రూ.2,30,000లు డిపాజిట్‌ చేశాడు. అయితే దీనికి తగ్గట్టుగానే మైక్‌ లాభాలు చూపించాడు. దీంతో ఇర్ఫాన్‌ పేరుతో ఉన్న బ్యాంక్‌ ఖాతాలో రూ.15,20,000 డిపాజిట్‌ చేశాడు. ఆ తర్వాత ఆ డబ్బులను నిందితులు విడతల వారీగా డ్రా చేశారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న ఉమాకాంత్‌ గత నెల 30న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డాటా ఆధారంగా బ్యాంక్‌ ఖాతాలు సమకూర్చిన కొండాపూర్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.కాగా వీరు దేశవ్యాప్తంగా పలువురిని ఫారెక్స్‌ ట్రేడ్‌ పేరుతో మోసం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా