వితంతు మహిళకు బురిడీ

13 Jan, 2020 11:15 IST|Sakshi

మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలోమోసగాళ్ల హవా

అందమైన ప్రొఫైల్స్‌లో అందినంత దోపిడీ  

యువతులు, మహిళలే లక్ష్యం  

బెంగళూరులో పెరుగుతున్న కేసులు

పెళ్లి సంబంధాల వ్యవహారం పేరయ్యలను దాటి ఇంటర్నెట్‌లోకి ప్రవేశించాక మోసగాళ్ల పంట పడింది. పెద్ద చదువులు, ఉన్నత కుటుంబం, మంచి ఉద్యోగం, విదేశాల్లో జీవితం అని మాయమాటలతో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. వారి మాటలను నమ్మి ఇట్టే డబ్బు, బంగారం ఇవ్వవద్దు, జాగ్రత్తగా వ్యవహరించాలనిపోలీసులు హెచ్చరిస్తున్నారు.   

కర్ణాటక, బనశంకరి: వధూవరుల అన్వేషణ వెబ్‌సైట్లలో వంచకుల హవా పెచ్చుమీరింది. అందమైన ఫోటోలు, పేరుపొందిన కంపెనీలు, ఉన్నత ఉద్యోగాలు, భారీ వేతనం, విదేశాల్లో నివాసం అని నమ్మించి అమాయకులను నిలువునా దోచుకుంటుననారు. అనేకమంది బాధితులు చెప్పుకుంటే పరువు పోతుందని మోసాన్ని బయటపెట్టడంలేదు.  అయినప్పటికీ ఇటీవల సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీనిని బట్టి మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ బాధితుల సంఖ్య పెరిగింది. 

ఎలా జరుగుతోంది
ముఖ్యంగా పురుష మోసగాళ్లు.. యువతులను, మహిళలకు వలవేసి వంచనకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్టవేయాలని పెళ్లి సంబంధాల సంస్థలు, వెబ్‌సైట్లకు లేఖ రాసినప్పటికీ వంచకుల హవా మాత్రం తగ్గడం లేదని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. బంధుమిత్రుల్లో సంబంధాలు లభించని పక్షంలో కొత్త సంబంధాల కోసం కుటుంబసభ్యులు ఆన్‌లైన్‌లో మ్యాట్రిమోనియల్‌ సంస్థలను, వెబ్‌సైట్లను ఆశ్రయించడం కొంతకాలంగా ఎక్కువైంది.  కొందరు విద్యావంతులు, మంచి ఉద్యోగం, శ్రీమంతులు, అందంగా ఉండే జంటతో వివాహం జరిపించాలనే ఆశతో  విస్తృతంగా ఆన్‌లైన్లో గాలిస్తుంటారు. అలాంటివారు లక్ష్యంగా వంచకులు అందమైన యువతీ యువకుల ఫోటోలు ఆప్‌లోడ్‌ చేసి, విదేశాల్లో డాక్టర్లు, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలని, దండిగా జీతం, విలాసవంతమైన కార్లు, ఇళ్లు ఉన్నాయని ప్రొఫెల్‌ పెడతారు. తప్పుడు అడ్రస్, ఈమెయిల్, మొబైల్‌ నెంబర్‌ అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడినుంచి మోసం మొదలవుతుంది. యువతీయువకుల తల్లిదండ్రులు ఒక్కసారి ఫోన్‌ చేస్తే చాలు, తీయని మాయమాటలతో వలలో మరిన్ని అబద్దాలతో అమాయకులను, కుటుంబసభ్యులను బుట్టలో వేసుకుంటారు. తమదీ మీ కులమేనని, పెళ్లికి రెడీ అని నమ్మించి, అత్యవసర పని పడిందని, పాస్‌పోర్ట్స్, వీసాలు, విలువైన గిప్టులు, పార్శిల్‌ పంపించామని విమానాశ్రయంలో కస్టమ్‌ అధికారులకు పన్నులు చెల్లించాలని భారీగా డబ్బు అకౌంట్లలో వేయించుకుని పత్తా లేకుండా పోతారు.

వితంతుకు బురిడీ
నగరంలో ఇటీవల మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లో నమోదు చేసుకున్న 49 ఏళ్ల వితంతు మహిళకు ఒక స్టీల్‌ కంపెనీ పారిశ్రామికవేత్త అని వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మరుసటిరోజు  కంపెనీలో పెట్టుబడి పెట్టాలని  ఆమె వద్ద 70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పత్తా లేడు. బాధితురాలు జీవన బీమానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

యువతులు, మహిళలే అధికం  
వంచకుల బుట్టలో పడేవారిలో ఉద్యోగస్తులు, యువతి లేదా వితంతువు మహిళలు అధికం. పేరుపొందిన కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి చేతినిండా డబ్బు సంపాదించి వైవాహిక జీవితంపై చాలా ఆశలు, కలల్లో ఉంటారు. కుటుంబసభ్యులు, బందువుల మాటలను లెక్కచేయకుండా వెబ్‌సైట్లలో సంబంధాలను గాలిస్తూ వంచకుల చేతుల్లో మోసపోతున్నారు.  
రెండో పెళ్లి చేసుకోవాలనుకునే మహిళలు సులభంగా వలలో చిక్కుకుంటున్నారు. అమాయక యువకులకు అర్ద నగ్న ఫోటోలు సేకరించి, వాటిని ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించడం, సాధ్యమైనంత దండుకోవడం వంటి కేసులు నమోదవుతున్నాయి. 

అప్రమత్తత అవసరం  
మ్యాట్రిమోనియల్‌ సైట్లో వ్యవహారాలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి  
తల్లిదండ్రుల సమక్షంలో ముఖాముఖి కూర్చుని చర్చలు జరపాలి  
ఒకటికి రెండుసార్లు పూర్తి వివరాలు, సమాచారం సేకరించాలి  
నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వరాదు  
తీయని మాయమాటలకు మోసపోవద్దు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు