ఈ–మోసగాడు.. నిండా ముంచాడు!

5 Mar, 2020 08:04 IST|Sakshi

మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయం

పెళ్లి చేసుకుంటానంటూ యువతికి ఎర

నేరుగా అడగకుండా రూ.9 లక్షలు స్వాహా

సిటీ సైబర్‌క్రైం ఠాణాలో కేసు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు సైబర్‌ నేరాలు జరిగే తీరుతెన్నులపై పోలీసులు అవగాహన కల్పిస్తుండగానే.. మరోవైపు సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్‌’ అవుతున్నారు. తమ పంథా ఎప్పటికప్పుడు మారుస్తూ ఈ నేరాలపై అవగాహన ఉన్న వారికీ అనుమానం రాకుండా అందినకాడికి దండుకుంటున్నారు. బుధవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదైన ప్రైవేట్‌ ఉద్యోగిని కేసే దీనికి తాజా ఉదాహరణ. ఈమెను మాటలతో మాయ చేసిన ఈ–మోసగాడు రూ.9.1 లక్షలు కాజేశాడు. నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్‌ ఉద్యోగం చేయడంతో పాటు కొన్నాళ్లుగా సొంతంగా కొన్ని ప్రాజెక్టులు సైతం చేస్తున్నారు. ఆమెకు ప్రస్తుతం వివాహంపై ఆసక్తి లేనప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు భారత్‌ మాట్రిమోని సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ ప్రొఫైల్‌ను ప్రస్తుతం కెనాడాలో నివసిస్తున్న పంజాబ్‌కు చెందిన జాన్‌ అనే వ్యక్తిగా చెప్పుకొంటూ ఒకరు లైక్‌ చేశారు. అక్కడి ఎయిర్‌బస్‌ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నానని చెప్పుకొన్న అతడు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరూ తమ ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడంతో వాట్సాప్‌ ద్వారా చాటింగ్, ఫోన్లు మొదలయ్యాయి.  

నమ్మకం కలిగేలా..
విద్యాధికురాలైన నగర యువతి దృష్టిలో సైబర్‌ నేరాలపై పోలీసు విభాగం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత జాన్‌ను కూడా అనుమానించిన ఆమె అతడిని పరీక్షించే ఉద్దేశంతో చాటింగ్‌ చేశారు. డబ్బు ఏమైనా అవసరమా? అంటూ అతడిని ప్రశ్నించారు. అతడి నుంచి ఔనంటూ సమాధానం వస్తే వెంటనే బ్లాక్‌ చేయాలని భావించారు. దీనికి నో అంటూ సమాధానం ఇచ్చిన సైబర్‌ నేరగాడు తనపై నమ్మకం కలిగేలా చేశాడు. సాధారణంగా మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌లో నేరగాళ్ళు బహుమతులు పంపుతున్నామని, తామే వస్తున్నామంటూ చెప్పడం, ఆపై విమానాశ్రయం నుంచి అంటూ కస్టమ్స్‌ అధికారులుగా ఫోన్లు చేయడం, పన్నుల పేరుతో డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడం.. చేస్తుంటారనే విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. వీటిలో జాన్‌ ఏ పంథాను అనుసరించినా దూరంగా ఉండాలని భావించారు. అయితే ఈ పంథాలకు భిన్నంగా వ్యవహరించిన సైబర్‌ నేరగాడు ఆమెకు టోకరా వేశాడు. ఎయిర్‌బస్‌ సంస్థలో భారీ స్కాం జరిగిందని, దాన్ని జీర్ణించుకోలేని నేపథ్యంలో తాను దాని నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు చెప్పాడు. సొంతంగానే కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నానని పేర్కొన్నాడు. ఆపై ఆమెకు టోకరా వేయడానికి అసలు కథ ప్రారంభించాడు. విమాన యానానికి సంబంధించి తన ప్రాజెక్టులో అనేక మంది దినసరి కూలీలు పని చేస్తున్నారని, వారికి రోజువారీ చెల్లింపులు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. దీనికోసం 10 వేల డాలర్లు అప్పుగా ఇవ్వాలంటూ కోరాడు. అంత మొత్తం తన వద్ద లేవని చెప్పిన యువతి రూ.2 లక్షలు పంపింది. అతడు మోసం చేస్తే చందా ఇచ్చానని భావించాలని ఆమె అనుకున్నారు. 

ఉద్యోగి చనిపోయాడంటూ నటన..
ఆ తర్వాత మూడు నెలల వరకు జాన్‌ నుంచి డబ్బు ప్రస్తావన రాలేదు. ఓ రోజు వాట్సాప్‌ కాల్‌ చేసిన జాన్‌... తన వద్ద పని చేసే ఓ ఉద్యోగి చనిపోయాడని, అతనికి ఇన్సూరెన్స్‌ చేయించక పొరపాటు చేశానంటూ ఏడుస్తున్నట్లు మాట్లాడాడు. దీంతో తనకు ఇబ్బందులు ఎదురుకానున్నాయని, తాను త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఇబ్బంది తనకు అడ్డంకిగా మారుతుందని వాపోయాడు. ఈ మాట లు నమ్మిన బాధితురాలు వివిధ దఫాల్లో రూ.7.10 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ మరో కారణం చెబుతూ డబ్బు ప్రస్తావన రావడంతో ఆమె అనుమానించారు. అతడి ఫోన్‌ నంబర్‌ను ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయగా.. అనేక మంది బాధితులు పెట్టిన కామెంట్‌ ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న జి.వెంకట రామిరెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వాడిన ఫోన్‌ నంబర్, బాధితురాలు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసిన బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితుడు నైజీరియన్‌ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు