పోస్టు చేయడమే పాపమైంది...

27 May, 2020 10:32 IST|Sakshi

ఎడాపెడా బాదేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

ఐదుగురు నగరవాసుల నుంచి రూ.5.29 లక్షలు స్వాహా

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులపై సైబర్‌ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. యాడ్స్‌ యాప్‌ ఓఎల్‌ ఎక్స్‌లో వస్తువులు ఉంచి అమ్ముతామని, ఇతరులు పొందుపరిచిన వాటికి కొనుగోలు చేస్తామ ని ఫోన్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. వీరి బారిని పడి రూ.5.29 లక్షలు నష్టపోయిన ఐదుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 

పోస్టు చేయడమే పాపమైంది...
కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో దీని నిరోధానికి ఉపకరించే వస్తువుల తయారీ, విక్రయాలు పెరిగాయి. ఇందులో భాగంగా నగరానికి చెందిన ఓ మహిళ శానిటైజర్‌ స్టాండ్‌లు తయారు చేస్తున్నామని, తక్కువ ధరకు విక్రయిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ఉన్న నంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించిన సైబర్‌ నేరగాడు తనను ఆర్మీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తమకు పెద్ద సంఖ్యలో స్టాండ్‌లు కావాలని కోరాడు. అందుకోసం కొంత మొత్తం అడ్వాన్సు పంపిస్తున్నానని, ఆ మొత్తం తీసుకుని తనకు ఓ నమూనా పంపాలని కోరాడు. నగదు చెల్లింపుల పేరుతో గూగుల్‌ పే ద్వారా కొన్ని క్యూఆర్‌ కోడ్స్‌ పంపాడు. వీటిని నగర మహిళ స్కాన్‌ చేయడంతో ఈమె ఖాతా నుంచి డబ్బు నేరగాడికి వెళ్లిపోయింది.

ఈ విషయం గుర్తించిన ఆమె ఫోన్‌ చేసి ప్రశ్నించగా.. రీఫండ్‌ ఇస్తున్నానంటూ మరికొన్ని క్యూఆర్‌ కోడ్స్‌ పంపాడు. వీటినీ స్కాన్‌ చేయగా తిరిగి రావాల్సింది పోయి మరికొంత అతడి ఖాతాలోకి వెళ్లింది. ఇలా ఆమె రూ.1.29 లక్షలు ఆమె కోల్పోయింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి కంప్రెషర్లు తయారు చేస్తుంటాడు. తాను తయారు చేసిన వాటిని విక్రయిస్తానంటూ పోస్టు చేశారు. దీనిని చూసి స్పందించిన సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు  చేస్తామంటూ కాల్‌ చేశారు. బేరసారాల అనంతరం అడ్వాన్స్‌ పంపుతున్నామంటూ గూగుల్‌ పే క్యూఆర్‌ కోడ్స్‌ పంపారు. వీటిని బాధితుడు స్కాన్‌ చేయగా... రూ.1.5 లక్షలు నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి.

అమ్ముతామంటూ అందినకాడికి...
వేసవి నేపథ్యంలో నగరంలో ఏసీలకు డిమాండ్‌ పెరిగింది. దీనిని కూడా సైబర్‌ నేరగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ ఏసీలు విక్రయిస్తామంటూ యాడ్స్‌ పోస్టు చేసి వాటిలో తమ ఫోన్‌ నంబర్లు పొందుపరుస్తున్నారు. వాటిని చూసి స్పందించిన వారి నుంచి ఆన్‌లైన్‌లో కాజేస్తున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ ఏసీల విక్రయం పేరుతో ఓఎల్‌ఎక్స్‌లో ఉన్న యాడ్స్‌ చూసి స్పందించిన ఇద్దరు నగర వాసులతో సైబర్‌ నేరగాళ్లు బేరసారాలు చేశారు. చివరకు ఓ రేటు ఖరారు చేసుకున్నారు.

నగదు చెల్లిస్తున్నామని, తమకు వచ్చిన నగదు రీఫండ్‌ ఇస్తున్నామంటూ వీరిద్దరికీ క్యూఆర్‌ కోడ్స్‌ పంపారు. వీటిని బాధితులు స్కాన్‌ చేయగా... ఒకరి నుంచి రూ.1.05లక్షలు, మరొకరి నుంచి రూ.84 వేలు కాజేశారు. నగరానికే చెందిన మరో వ్యక్తి సెకండ్‌ హ్యాండ్‌ కారు ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌ చేశారు. మారుతి స్విఫ్ట్‌ కారు విక్రయం పేరుతో ఉన్న యాడ్‌ చూసిన అతను అందులో పేర్కొన్న  ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేశాడు. స్పందించిన సైబర్‌ నేరగాళ్లు బేరసారాల తర్వాత కారును రూ.45 వేలకు అమ్మడానికి అంగీకరించారు. ఆ వాహనం పంపిస్తున్నామంటూ చెప్పి అడ్వాన్సు, ఇతర ఖర్చుల పేరుతో రూ.61,300 కాజేశారు. ఈ ఐదుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా