ట్రెడ్‌ మిల్‌ అమ్మబోతే..!

15 Jun, 2020 10:21 IST|Sakshi

నగరానికి చెందిన న్యాయవాదికి టోకరా

రూ.1.5 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సెకండ్‌ హ్యాండ్‌ ట్రెడ్‌ మిల్‌ విక్రయించాలని ప్రయత్నించిన నగర వాసిని సైబర్‌ నేరగాళ్ళు నిండా ముంచారు. ఈయనకు క్యూఆర్‌ కోడ్స్‌ పంపిన క్రిమినల్స్‌ రూ.1.5 లక్షలు కాజేశారు. ఆదివారం బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్‌ మిల్‌ను విక్రయించాలని భావించారు. దీంతో దాని ఫొటో, తన ఫోన్‌ నెంబర్‌ ఇతర వివరాలను ఓఎల్‌ఎక్స్‌లో పొందుపరిచారు. దీనికి స్పందిస్తున్నట్లు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఎదుటి వ్యక్తి మాటలు నమ్మిన న్యాయవాది బేరాలు కూడా పూర్తి చేశారు.

సదరు ట్రెడ్‌ మిల్‌ను రూ.10 వేలకు అమ్మడానికి రేటు ఖరారైంది. ఆపై అసలు కథ ప్రారంభించిన సైబర్‌ నేరగాడు తన ఫోన్‌కు గూగుల్‌ పే ద్వారా రూ.5 పంపాలని, ఆ వెంటనే రూ.10 వేలు మీ ఖాతాలోకి వస్తాయంటూ చెప్పాడు. న్యాయవాది అలానే చేయడంతో ఆయన ఖాతాలోకి డబ్బు వచ్చింది. ఇలా తమకు రూ.5 వేలు పంపిస్తే రూ.10 వేలు ఖాతాలోకి వస్తాయంటూ నమ్మించారు. పలు దఫాలుగా క్యూఆర్‌ కోడ్స్‌ పంపిన సైబర్‌ నేరగాళ్ళు న్యాయవాది ఖాతా నుంచి రూ.1.5 లక్షలు కాజేశారు. ఈయన సెల్‌ఫోన్‌ నెంబర్‌కు గూగుల్‌ పే ఖాతాకు మూడు బ్యాంకు ఖాతాలు అనుసంధానించి ఉన్నాయి. వాటిలో రెండు ఖాతాల నుంచి ఈ డబ్బు పోయింది. అయితే తాను సైబర్‌ నేరగాళ్ళు సూచించినట్లు చేయలేదని, అయినా డబ్బు పోయిందని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న  సిటీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు