కరాచీ బేకరీ పేరుతో మోసాలు..

7 May, 2020 08:04 IST|Sakshi

బీఈలో ఉద్యోగాలంటూ దందా  

కరాచీ బేకరీ పేరుతో మోసాలు

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసులు

సాక్షి, సిటీబ్యూరో:  నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ సంస్థ బయోలాజికల్‌–ఈ(బీఈ) లిమిటెడ్‌లో ఉద్యోగాల పేరుతో కొందరు సైబర్‌ నేరగాళ్లు దందా చేస్తున్నారు. ఈ సంస్థ పేరుతో ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్లు సైతం జారీ చేసిన క్రిమినల్స్‌ అనేక మంది ఆకర్షించారు. వీరి చేతిలో మోసపోయిన కొందరు బాధితులు విషయం తెలియక ఇటీవల బీఈ సంస్థకు ఫోన్లు చేయడం మొదలెట్టారు. తాము మీ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమవద్ద అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు సైతం ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే తాము ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదంటూ వారికి స్పష్టం చేసిన బీఈ విషయాన్ని బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి బీఈ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ నిరుద్యోగులతో సైబర్‌ నేరగాళ్లు రూ.లక్షలకు ఒప్పందాలు చేసుకున్నారని, అయితే ఎవరైనా నగదు చెల్లించారా? లేదా? అనేది ఆరా తీయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలోని బేకరీలు సైతం మూతపడ్డాయి. దీన్ని కూడా క్యాష్‌ చేసుకోవడానికి సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగారు. కరాచీ బేకరీ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ ఖాతా తెరిచారు. ఇందులో కొన్ని నెంబర్లు సైతం పొందుపరిచిన నేరగాళ్లు తమను సంప్రదించిన వారితో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, డోర్‌ డెలివరీ చేస్తామంటూ నమ్మించారు. వీరి మాట నమ్మిన అనేక మంది వివిధ వ్యాలెట్ల ద్వారా నగదు చెల్లించి మోసపోయారు. వీరిలో కొందరు బుధవారం ఆ సంస్థ దుకాణాలు తెరవడంతో వెళ్లి సంప్రదించారు. ఇలా ఫేస్‌బుక్‌ కేంద్రంగా సాగుతున్న మోసాన్ని తెలుసుకున్న కరాచీ బేకరీ యాజమాన్యం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

కొరియర్‌లో రావాల్సిన క్రెడిట్‌ కార్డు కోసం ఒకరు, ఎయిర్‌ కూలర్‌ ఖరీదు చేయాలని భావించిన మరొకరు గూగుల్‌లోని నకిలీ కాల్‌ సెంటర్‌ నెంబర్లకు సంప్రదించి నిండా మునిగారు. చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఎస్బీఐ క్రెడిట్‌కార్డు బ్లూడార్ట్‌ కొరియర్‌లో రావాల్సి ఉంది. నిర్ణీత గడువు ముగిసినా అది డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ట్రాక్‌ చేశాడు. అందులో ఇంటికి తాళం వేసి ఉండటంతో కార్డు వెనక్కు వచ్చేసినట్లు ఉంది. దీంతో బ్లూడార్ట్‌ సంస్థ నెంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. అక్కడ లభించిన ఓ నకిలీ నెంబర్‌కు కాల్‌ చేయగా.. సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్‌ నేరగాళ్లు మాట్లాడారు. ఆ కార్డు పొందాలంటూ తాము పంపే లింకులో ఉండే ఫారం నింపాలని సూచించారు. బాధితుడు ఆ ఫారంలో ఉన్న కాలమ్స్‌లో తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ సైతం నింపాడు. దీంతో అతడి ఖాతా నుంచి రూ.90 వేలు కాజేశారు. నగరానికి చెందిన మరో వ్యక్తి సింఫనీ ఎయిర్‌కూలర్‌ ఖరీదు చేయాలని భావించారు. ఆ సంస్థ నెంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి నకిలీ కాల్‌సెంటర్‌ నెంబర్‌కు కాల్‌ చేశాడు. రూ.9,600కే కూలర్‌ ఇస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ పే యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. దాని ద్వారా తమ నెంబర్‌కు రూ.19,600 పంపాలని సూచించారు. రికార్డుల్లో కూలర్‌ మొత్తం ధర నమోదు కావాలని, ఆ తర్వాత కూలర్‌తో పాటు రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. ఈ మాటలు బాధితుడు నమ్మడంతో లావాదేవీ సరిగ్గా జరగలేదంటూ పలు దఫాలుగా అతడి నుంచి రూ.97 వేలు కాజేశారు.  

మరోపక్క ఓఎల్‌ఎక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రయం పేరుతో యాడ్స్‌ పొందుపరిచిన సైబర్‌ నేరగాళ్లు ముగ్గురు నగరవాసులకు టోకరా వేశారు. ఇన్నోవా విక్రయం పేరుతో రూ.65 వేలు, బొలేరో పేరుతో రూ.56 వేలు, హోండా యాక్టివ విక్రయం అంటూ రూ.42 వేలు కాజేశారు. బాధితులకు నేరగాళ్లు ఆర్మీ ఉద్యోగుల మాదిరిగానే పరిచయం అయ్యారు. వీరి ఫిర్యాదుల మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా