నకిలీ ఐడీ.. మెయిల్‌ హ్యాక్‌!

13 Mar, 2020 09:21 IST|Sakshi

సిటీ సంస్థ అధికారిక మెయిల్‌ హ్యాక్‌

దీని ఆధారంగా కొన్ని కంపెనీలకు మెయిల్‌

తమ ఖాతాలో డబ్బు వేసేలా ప్రయత్నం

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ సంస్థ అధికారిక ఈ–మెయిల్‌ ఐడీలో ఒక్క అక్షరం మార్చి మరో ఐడీని సృష్టించిన సైబర్‌ నేరగాళ్ళు అకౌంట్‌ టేకోవర్‌ ఫ్రాడ్‌కు ప్రయత్నించారు. అయితే ఆఖరి నిమిషంలో సదరు సంస్థ అప్రమత్తం కావడంతో ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. తమ సంస్థ ఈ–మెయల్‌ను కొందరు దుండగులు హ్యాక్‌ చేశారంటూ ఆ సంస్థ గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీకి  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన సదరు సంస్థ ఎలక్ట్రానిక్‌ వస్తువుల రంగంలో ఉంది. తమ ఉత్పత్తుల్ని దేశవిదేశాల్లోని అనేక కంపెనీలకు విక్రయిస్తూ ఉంటుంది. ఈ క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా కంపెనీలకు ఈ సంస్థకు మధ్య ఈ–మెయిల్స్‌ రూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. ఆ కంపెనీలకు ఈ–మెయిల్‌ రూపంలో ఇన్వాయిస్‌లను పంపే బంజారాహిల్స్‌ సంస్థ ఆ మేరకు తమకు రావాల్సిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటుంది.

బాధిత సంస్థకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ను హ్యాక్‌ చేసిన నేరగాళ్ళు అందులో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించారు. వీటి ఆధారంగా బంజారాహిల్స్‌ సంస్థ ఏఏ కంపెనీతో వ్యాపారం చేస్తోందో గుర్తించారు. ఆయా కంపెనీలకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ ఐడీలను మెయిల్‌ కాంటాక్టŠస్‌ నుంచి సంగ్రహించారు. వీటిని క్యాష్‌ చేసుకోవడానికి రంగంలోకి దిగిన సైబర్‌ నేరగాళ్ళు సిటీ సంస్థ అధికారిక మెయిల్‌ ఐడీని పొందినదే మరోటి సృష్టించాడు. ఇందులో కేవలం ఓ అక్షరాన్ని మార్చి సాధారణంగా గుర్తుపట్టలేని విధంగా రూపొందించాడు. బంజారాహిల్స్‌ సంస్థ మెయిల్‌లో ఉన్న కాంటాక్ట్‌ లిస్టుల్లో ఎంపిక చేసిన వాటిని సైబర్‌ నేరగాళ్ళు మెయిల్‌ పంపారు. ఏఏ కంపెనీల నుంచి అయితే ఈ సంస్థకు డబ్బు రావాల్సి ఉందో వాటినే టార్గెట్‌గా చేసుకున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో బ్యాంకు ఖాతా మార్చామని, ఈసారి నుంచి ఇందులోనే నగదు జమ చేయాలని సూచిస్తూ వాటికి ఈ–మెయిల్‌ పంపారు. మార్చిన ఖాతా అంటూ తమకు చెందిన అకౌంట్‌ వివరాలు పొందుపరిచారు. దీనిపై అనుమానం వచ్చిన కొన్ని కంపెనీలు బంజారాహిల్స్‌ సంస్థను సంప్రదించాయి. ఇలా జరిగిన విషయం తెలుసుకున్న బాధిత సంస్థ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హ్యాకింగ్‌ ఆరోపణలపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు