'ర్యాన్‌సమ్‌' రాక్షసి!

3 May, 2019 01:38 IST|Sakshi

కొత్త వైరస్‌తో డేటా లక్ష్యంగా దాడులు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలే టార్గెట్‌

కంప్యూటర్లను లాక్‌ చేస్తున్న సైబర్‌ నేరస్తులు

జాగ్రత్తగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ నిపుణులు

ర్యాన్‌సమ్‌వేర్‌..కంప్యూటర్‌ వాడుతున్న వారి గుండెల్లో ఇప్పుడు గుబులు పెట్టిస్తున్న పేరు. ఎప్పుడు.. ఏ కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి సమాచారాన్ని దొంగిలిస్తారో తెలియక బెంబేలెత్తుతున్నారు. సంస్థలకు సంబంధించిన డేటా తస్కరణకు గురైతే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన డిస్కంలకు సంబంధించిన కంప్యూటర్లను ర్యాన్‌సమ్‌వేర్‌ అటాక్‌ చేసిన విషయం తెలిసిందే. గడువులోగా ఆ సైబర్‌ నేరగాళ్లు 6 బిట్‌కాయిన్స్‌ (దాదాపు రూ.24 లక్షలు) డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే కంప్యూటర్లను బ్లాక్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఈ నేరాలను కట్టడి చేయడం ఎలాగో తెలియక సైబర్‌ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.  
 –సాక్షి, హైదరాబాద్‌

‘కీ’లేకుండా అన్‌లాక్‌ కష్టమే..
కంప్యూటర్‌లోని డేటా ఎన్‌క్రిప్షన్‌ (లాక్‌ చేయడంలో) రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్‌ విధానంలో లాకింగ్, అన్‌–లాకింగ్‌కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్‌ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్‌–సెమెట్రిక్‌ విధానంలో వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్‌సమ్‌వేర్‌ పంపే నేరస్తులు ఈ విధానంలోనే లాక్‌ చేస్తారు. దీంతో వారి వద్ద ఉన్న ప్రైవేట్‌ కీ తెలిస్తే తప్ప ఆ కంప్యూటర్‌ అన్‌లాక్‌ కాదు. ఫార్మాట్‌ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులకు మరో దారి లేక మనీప్యాక్, ఓచర్స్, ఈ–మనీ రూపాల్లో వారు డిమాండ్‌ చేసిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. నగదు తమకు చేరిన తర్వాత ఆ సైబర్‌ నేరస్తులు వైరస్‌ ప్రోగ్రామ్‌ ద్వారానే అన్‌ లాక్‌ కీ పంపిస్తున్నారు. దీన్ని వినియోగిస్తే మాత్రమే కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ యథాప్రకారం ఓపెన్‌ కావడంతో పాటు అందులోని డేటా భద్రంగా ఉంటుంది.

దర్యాప్తు, నిఘా సంస్థల పేరుతోనూ
ర్యాన్‌సమ్‌వేర్‌తో పాటు బ్రౌజర్‌ లాకర్‌ వైరస్‌ ముప్పు పెరిగింది. ఇందులో కంప్యూటర్‌ మొత్తం లాక్‌ కావడంతో పాటు ఆ పని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్‌ చేసినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ వైరస్‌ దానంతట అదే వెబ్‌క్యాప్‌ను ఆపరేట్‌ చేయడంతో పాటు కంప్యూటర్‌ ఐపీ అడ్రస్, లొకేషన్స్‌ తెరపై డిస్‌ప్లే చేస్తుంది. ‘మీ కదలికల్ని గమనిస్తున్నాం. చేసిన పొరపాటుకు పెనాల్టీ చెల్లించండి’ అంటూ కనిపిస్తుంది.

ర్యాన్‌సమ్‌వేర్, బ్రౌజర్‌ లాకర్‌ వంటి వైరస్‌లను సైబర్‌ నేరగాళ్లు ఈ–మెయిల్స్, యాడ్స్‌ రూపంలో కంప్యూటర్లకు పంపిస్తున్నారు. ఉద్యోగార్థులకు సంబంధించిన ఈ–మెయిల్‌ ఐడీలను వివిధ ఉద్యోగ సంబంధిత వెబ్‌సైట్లు, అవివాహితులు, వివాహం కోసం రిజిస్టర్‌ చేసుకున్న వారికి మాట్రిమోనియల్‌ సైట్స్‌ నుంచి సైబర్‌ నేరస్తులు సంగ్రహిస్తున్నారు. అలా ఈ–మెయిల్‌ ఐడీలు సంగ్రహించే సైబర్‌ నేరస్తులు వాటికి అనుగుణంగా ఉద్యోగావకాశం, వివాహ సంబంధం, వృత్తి, వ్యాపారం పెంపొందించే మార్గాలంటూ టార్గెట్‌ చేసిన వారికి మెయిల్స్‌ పంపడం, యాడ్స్‌ రూపంలో పాప్‌అప్స్‌ ఇస్తున్నారు. వీటిని చూసిన వారు ఆకర్షితులవుతున్నారు. ఈ–మెయిల్, యాడ్‌లోని వివరాలు చూసేందుకు లింకు ఓపెన్‌ చేస్తే చాలు.. ఆ వైరస్‌ కంప్యూటర్‌/ ల్యాప్‌టాప్‌లోకి జొరపడుతోంది.

లాక్‌ చేశామని చెబుతూనే
ఈ ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌ కంప్యూటర్‌లో ప్రవేశించిన మరుక్షణం అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి, సిస్టం మొత్తాన్ని లాక్‌ చేస్తుంది. మానిటర్‌పై ‘మీ కంప్యూటర్‌ను లాక్‌ చేశాం’అనే మెసేజ్‌ కనిపిస్తుంది. దీన్ని అన్‌లాక్‌ చేయడానికి పాస్‌వర్డ్‌ మావద్ద ఉందని చెబుతూ.. 3 రోజుల్లో బిట్‌కాయిన్స్‌ చెల్లించాలని బెదిరి స్తారు. ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌తో లాక్‌ అయిన కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌పై నిర్దేశించిన గడువుకు సంబంధించి కౌంట్‌డౌన్‌ కూడా ప్రోగ్రామింగ్‌ చేస్తున్నారు.

డేటా భద్రంగానే ఉంది 
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైనా, సంస్థకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉందని సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం తెలిపారు. ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, వెబ్‌సైట్‌ ఆధారిత సేవలకు విఘాతం కలిగిందన్నారు.  వెబ్‌సైట్‌ పునరుద్ధరణకు టీసీఎస్‌ సంస్థ నిర్విరామంగా పనిచేస్తోందని, సాధ్యమైనంత త్వరగా వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

రాబిన్‌హుడ్‌ పేరుతో..
డిస్కం వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్తులు దానికి రాబిన్‌హుడ్‌ పేరు పెట్టారని పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు