వీకెండ్‌లో సిమ్‌ బ్లాకా?

16 Mar, 2020 07:45 IST|Sakshi

సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడ కావొచ్చంటున్న పోలీసులు

బ్యాంకు ఖాతాతో ముడిపడి ఉంటే మరింత ముప్పు

సెలవులున్నా తక్షణం స్పందించాలంటున్న అధికారులు

మనీ ట్రాన్స్‌ఫర్‌ కాకున్నా.. ఆన్‌లైన్‌ ఖరీదులకు అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్‌లోనో.. వరుసగా సెలవులు ఉన్నప్పుడో హఠాత్తుగా మీ సిమ్‌కార్డు పని చేయకుండా బ్లాక్‌ అయిందా? మీ బ్యాంకు ఖాతా లావాదేవీలతో అది ముడిపడి ఉందా? ఆర్‌టీజీఎస్‌ వంటి ప్రక్రియలకు సంబంధించిన పిన్‌ ఆ నంబర్‌కే వస్తుంటుందా? అయితే ఇది సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడగా అనుమానించాలంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. ఎవరికైనా ఇలా బ్లాక్‌ అయి ఉంటే తక్షణం స్పందించి సర్వీస్‌ ప్రొవైడర్‌తో పాటు బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. 

‘బ్లాక్‌’తో డమ్మీవి తీసుకుంటున్నారు..
ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ పట్టణాలు, నగరాలకు పంపి కరెంట్‌ ఖాతాలు తెరిపిస్తున్న నైజీరియన్లు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్‌ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఆ తర్వాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితులు సిమ్‌కార్డుల్ని వీరు చాకచక్యంగా బ్లాక్‌ చేయిస్తున్నారని తేలింది. దీనికోసం అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్కడకు వెళ్లి సర్వీస్‌ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడిని సంబంధించిన పూర్తి సమాచారం వెబ్‌సైట్‌ ద్వారా వీరివద్దకు చేరి ఉంటోంది. ఈ వివరాలతో బోగస్‌ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్‌కార్డు పోయిందని, మరోటి ఇప్పించమంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. దీంతో సెల్‌ కంపెనీల వారు అసలు ఆ నెంబర్‌తో పని చేస్తున్న సిమ్‌ను బ్లాక్‌ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందించేస్తున్నారు. ఈ పనిని ఎక్కువగా వారాంతాల్లో, సెలవు దినాల్లో చేస్తుండటంతో సిమ్‌ బ్లాక్‌ అయినట్లు దాని యజమానులు గుర్తించినా... సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించడానికి కొంత సమయం తీసుకుంటున్నారు. 

అదను చూసుకుని భారీ మొత్తం స్వాహా..
అసలు వ్యక్తి వివరాలతు డూప్లికేట్‌ సిమ్‌ తమ చేతికి వచ్చిన తర్వాత సైబర్‌ నేరగాళ్లు అసలు అంకం ప్రారంభిస్తున్నారు. అప్పటికే ‘వెబ్‌సైట్‌’ ద్వారా బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలను సంగ్రహించే ఈ– కేటుగాళ్లు వాటిని తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక తీసుకున్న సిమ్‌ను వినియోగించి బ్యాంకుకు కాల్‌ చేస్తున్న నేరగాళ్లు ఖాతాదారుడి మాదిరిగానే మాట్లాడుతూ... ఓ సంస్థకు రియల్‌– టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) పద్ధతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం వన్‌–టైమ్‌ ట్రాన్సాక్షన్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీడబ్ల్యూ) పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నంబర్‌ నుంచే ఫోన్‌ రావడం, వారు అడిగిన అన్ని వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీడబ్ల్యూ ఇచ్చేస్తున్నారు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్‌ చేసిన ఖాతాను ఆన్‌లైన్‌ ద్వారా యాక్సిస్‌ చేస్తున్న నేరగాళ్లు అప్పటికే తెరిచి ఉంచిన బోగస్‌ కరెంట్‌ ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స్‌ ఖాతాలనూ ఇదే పంథాలో వివరాలు, సిమ్‌ సంగ్రహించడం ద్వారా ఖాళీ చేస్తున్నారు. 

డ్రా చేయడం సాధ్యం కాకపోయినా..
సైబర్‌ నేరగాళ్లు ఈ కరెంట్, సేవింగ్స్‌ ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్‌’ ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్‌ ధ్రువీకరణలు తయారు చేయించి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్స్‌ఫర్‌ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేయించేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్‌గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్లుగా ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్లి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా కేవలం ఈ మనీ మ్యూల్స్‌ మాత్రమే చిక్కుతారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకి రారు. అనేక సందర్భాల్లో అసలు వ్యక్తులైన బాధితులు మోసం, నగదు బదిలలీ జరిగిన విషయాలను గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వీరు వాడేవన్నీ బోగస్‌ వివరాలతో తీసుకున్నవి కావడంతో చిక్కడం కూడా కష్టంగా మారుతోంది. కేంద్ర తాజాగా తీసుకున్న ‘కరెన్సీ నిర్ణయం’తో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు వచ్చాయి. దీంతో సైబర్‌ నేరగాళ్లు నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అయినప్పటికీ ఆన్‌లైన్‌లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్‌ చిరునామాల్లోనే, కొరియర్‌ వారిని తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

మైక్రో సిమ్‌కార్డుల ఆధారంగా మరోలా...
ఇటీవల కాలంలో అన్ని సెల్‌ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు మైక్రో సిమ్‌కార్డుల్ని అందిస్తున్నారు. సెల్‌ఫోన్లన్నీ ఇవి పట్టే విధంగానే డిజైన్‌ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ–ప్లేస్‌’ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం సైబర్‌ నేరగాళ్లు తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు. అప్పటికే ‘వెబ్‌సైట్ల’ ద్వారా వినియోగదారుడి పూర్తి వివరాలు సంగ్రహిస్తున్న సైబర్‌ నేరగాళ్లు సిమ్‌ బ్లాకింగ్‌ కోసం మైక్రో కార్డు ‘విధానాన్ని’ అవలంబిస్తున్నారు.

ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్‌కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్‌ సిమ్‌ ఐడెంటిటీ (ఐసీఐడీ) నంబర్‌ను పాత పెద్ద సిమ్‌ నుంచి సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్‌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్‌ నేరగాళ్లు మైక్రో సిమ్‌ తీసుకుంటున్నారు. అప్పటికే సంగ్రహించిన వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదిస్తున్నారు. అనివార్య కారణాలు చెప్తూ అప్పటికే వారు వినియోగిస్తున్న పాత సిమ్‌కార్డు నుంచి తాము పంపే నెంబర్‌ను (ఐసీఐడీని) సర్వీసు ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్‌ చేయమని చెప్తున్నారు. అలా చేసిన వెంటనే కొన్ని గంటల పాటు సిమ్‌ పని చేయదని, ఆపై అప్‌డేట్‌ అవుతుందని నమ్మబలికుతున్నారు. వీరి వలలో పడిన వినియోగదారులు అలా చేసేసరికి నేరగాళ్లు తీసుకున్న మైక్రో సిమ్‌ యాక్టివేట్‌ అవుతోంది. వినియోగదారుల మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు