క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ పేరుతో కొల్లగొడుతున్నారు

29 Dec, 2019 08:11 IST|Sakshi

విషింగ్‌ కాల్స్‌తో బ్యాంక్‌ ఖాతాదారులకు సైబర్‌ నేరగాళ్ల టోకరా

సైబరాబాద్‌ వాసి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.87,719 మాయం

అపరిచితులకు బ్యాంక్‌ కార్డు వివరాలు చెప్పొద్దంటున్న పోలీసులు

‘షేక్‌ షాజీదుద్దీన్‌కు ఈ నెల 19న యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుడిపార్ట్‌మెంట్‌ పేరుతో ఓ కాల్‌ వచ్చింది. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కోసం మీడెబిట్‌ కార్డు వివరాలు చెప్పాలని కోరారు. వారి మాటలు నమ్మిన అతడు యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్‌ కార్డు వివరాలతో పాటు వన్‌టైమ్‌పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ను సైబర్‌ నేరగాళ్లకు పంపించారు. ఆ తర్వాత అతడి బ్యాంక్‌ ఖాతా నుంచి ఏడు బ్యాంక్‌ లావాదేవీలు జరిగి రూ.87,719 డెబిట్‌ అయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించిన షేక్‌ షాజీదుద్దీన్‌ ఈ నెల 23న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు’

సాక్షి, సిటీబ్యూరో: మీ క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ చేయాల్సి ఉంది...అందుకోసం మీ డెబిట్‌ కార్డు వివరాలు చెప్పాలంటూ సైబర్‌ నేరగాళ్లు విషింగ్‌ కాల్స్‌ చేసి వివిధ బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు లాగేస్తున్నారు. బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు విభాగం ప్రతినిధుల్లాగానే మాట్లాడుతూ ఖాతాదారులను మాటలతో మభ్యపెట్టి అన్ని వివరాలు సేకరించి ఏకంగా రూ.లక్షల్లో టోకరా వేస్తున్నారు. ప్రజలు ఆన్‌లైన్‌ లావాదేవీల చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తుండటాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు వినూత్న పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న రూ.లక్షల్లో మూల్యం చెల్లించాల్సి వస్తుందని, సైబర్‌ నేరాలబారిన పడుతున్న వారిలో విద్యాధికులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. 

ఓటీపీ చెబితే అంతే..
బ్యాంక్‌ ప్రతినిధులెవరూ మీ కార్డు వివరాలు, పిన్‌ నంబర్, ఓటీపీలు అడగరు. ఒకవేళ అలా అడిగితే ఇవ్వవద్దు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఏ లింక్‌ను కూడా క్లిక్‌ చేయవద్దు. అలా చేస్తే మీ బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు బదిలీ జరిగే అవకాశముంది.
సీవీవీ, ఓటీపీ, పిన్‌ నంబర్లు కాన్ఫిడెన్షియల్‌. వీటిని ఎవరితో షేర్‌ చేయవద్దు. ఫిషింగ్‌ కాల్స్, విషింగ్‌ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండండి.
ఏటీఏంలలో డబ్బులు డ్రా చేసే సమయాల్లో అపరిచితుల సహాయం తీసుకోవద్దు. అలాగే ఆ ఏటీఎంలలో స్కిమ్మర్లు ఫిట్‌ చేశారో తనిఖీ చేయండి.
మీ బ్యాంక్‌ ఖాతా నుంచి ఏదైనా మోసపూరిత లావాదేవీలు జరిగాయని గుర్తిస్తే వెంటనే హోంబ్యాంక్‌ బ్రాంచ్‌కు సమాచారం అందించండి. ఆ వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి.
మీ క్రెడిట్‌ కార్డు ద్వారా అంతర్జాతీయ లావాదేవీ జరిగితే సంబంధిత బ్యాంక్‌కు ఈ విషయాన్ని తెలపండి. మీరు ఫిర్యాదు చేసిన రోజు నుంచి 90 రోజుల్లో మీ నగదును బ్యాంక్‌ ఖాతాలో రిఫండ్‌ చేసే అవకాశముంది. లేకపోతే మెయిల్‌ ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సమాచారం అందించండి. 

మరిన్ని వార్తలు