20 రోజులు.. 2 సార్లు.. రూ.2.2 లక్షలు!

12 Feb, 2020 08:09 IST|Sakshi

టార్గెట్‌గా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

బ్యాంకు ఖాతా నుంచి కాజేసిన నేరగాళ్లు

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో బాధితుడి ఫిర్యాదులు

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఓ సైబర్‌ నేరం బారినపడిన బాధితులు ఏం చేస్తారు? అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ మరోసారి ‘ఈ– కేటుగాళ్ల‘కు అవకాశం ఇవ్వరు. కానీ.. నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మాత్రం కేవలం 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు టార్గెట్‌గా మారి రూ.2.2 లక్షలు పోగొట్టుకున్నాడు. తన ఖాతా నుంచి రూ.70 వేలు మాయంపై గత నెల్లో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే ఖాతా నుంచి మరో రూ.1.5 లక్షలు పోయాయంటూ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు మరో ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండింటికీ సంబంధించి కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన బాధితుడు తన నెట్‌ బ్యాంకింగ్‌లోకి సైబర్‌ నేరగాళ్ళు జోరబడిన విషయాన్ని గుర్తించకపోవడంతోనే ఇలా జరిగింది. సికింద్రాబాద్‌లో నివసించే సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా ఉంది. 20 రోజుల క్రితం ఇతని నెట్‌ బ్యాంకింగ్‌లోకి ఇతడి ప్రమేయం లేకుండానే ఓ కొత్త బెనిఫిషియరీ వచ్చి చేరాడు.

ఈ విషయాన్ని ఆ సమయంలో బాధితుడు గుర్తించలేకపోయాడు. తన నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తదితరాలు ఎలా అతడికి చేరాయో తెలుసుకునే ప్రయత్నం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సైబర్‌ నేరగాళ్లు ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఖాతా నుంచి రూ.70 వేలు కాజేశాడు. దీంతో అవాక్కైన బాధితుడు బ్యాంకునకు ఫిర్యాదు చేయడంతో నెట్‌ బ్యాంకింగ్, డెబిట్‌ కార్డుల లావాదేవీల్ని బ్లాక్‌ చేశామంటూ ఆ అధికారులు మౌఖికంగా చెప్పారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత నెల్లో ఓ కేసు నమోదు చేశారు. ఇది దర్యాప్తులో ఉండగానే అదే బాధితుడు మరోసారి సైబర్‌ నేరగాళ్ళ బారినపడ్డాడు.  బ్యాంకు అధికారులు చెప్పినట్లు తన నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ అయినందని భావించిన అతగాడు దాని పాస్‌వర్డ్‌ మార్చడం, యాడ్‌ అయిన బెనిఫిషియరీని డిలీట్‌ వంటివి చేయలేదు. తాను తీసుకున్న రుణాలకు సంబంధించిన నెల వారీ వాయిదాలు చెల్లించాల్సిన సమయం సమీపించడంతో, రూ.1.7 లక్షలకు తాను జారీ చేసిన చెక్కులు క్లియర్‌ అవ్వాల్సి ఉండటంతో రెండు రోజుల క్రితం తన ఖాతాలో బ్యాంకు నుంచి ఆ మొత్తం డిపాజిట్‌ చేశాడు. కొన్ని గంటల్లోనే ఆ మొత్తం నుంచి రూ.1.5 లక్షలు మాయం అయినట్లు గుర్తించాడు. దీంతో షాక్‌కు గురైన బాధితుడు బ్యాంకు అధికారుల్ని ఆశ్రయించగా సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీంతో మంగళవారం మరోసారి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు