రవిప్రకాశ్‌, శివాజీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

18 May, 2019 12:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీ, మాజీ సీఎఫ్‌వో మూర్తికి కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు సీజ్‌ చేసిన విషయం విదితమే.

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా...వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్‌, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎఫ్‌వో మూర్తి విచారణ నిమిత్తం సైబరాబాద్‌ పోలీసుల ఎదుట హాజరు అయ్యారు. ఈ విచారణలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

ఇక టీవీ9లో వీరు చేసిన అక్రమాలు, తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 2018 ఫిబ్రవరిలో నటుడు శివాజీ, రవి ప్రకాష్‌, శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. టీవీ9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైనా రవి ప్రకాష్, శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా ? మరింత ఆసక్తిగా మారింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

 

మరిన్ని వార్తలు