డీఎస్‌ కుమారుడు సంజయ్‌ అరెస్టు

13 Aug, 2018 02:43 IST|Sakshi
వైద్య పరీక్షల కోసం సంజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

     జైలుకు తరలించిన పోలీసులు 

     రాత్రి 11 గంటల వరకు హైడ్రామా 

     రిమాండ్‌ రిపోర్టును తోసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు 

     చివరికి ఫ్యామిలీ కోర్టు జడ్జి నిర్ణయంతో కారాగారానికి..

నిజామాబాద్‌ అర్బన్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఎట్టకేలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. మూడు గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఆదివారం రాత్రి జిల్లా జైలుకు తరలించారు. సంజయ్‌ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. వారు వేసిన రిమాండ్‌ పిటిషన్లను ఇద్దరు న్యాయమూర్తులు కొట్టి వేసినప్పటికీ.. తమ ప్రయత్నాలను కొనసాగించడంతో రాత్రి 11 గంటల వరకు హైడ్రామా కొనసాగింది.

చివరకు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంజయ్‌.. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఆర్పీసీ 41 ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి ఆయన్ను విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈలోపే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెండ్రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. 

సక్రమంగా లేని అభియోగాలు.. 
అజ్ఞాతంలో ఉన్న సంజయ్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు తన న్యాయవాదులతో కలసి నిజామాబాద్‌ ఏసీపీ సుదర్శన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించిన పోలీసులు.. ఆయన్ను రిమాండ్‌కు పంపేందుకు నివేదికను సిద్ధం చేసుకొని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ్నుంచి తీసుకువెళ్లి గంగాస్థాన్‌లో నివాసముండే మొదటి అదనపు జడ్జి మేరి సార దానమ్మ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్‌ రిపోర్టు సక్రమంగా లేదని తోసిపుచ్చారు. సీఆర్పీసీ 41 ఏ ప్రకారమే విచారణ జరపాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు ఆయన్ను రిమాండ్‌కు తరలించే అవకాశం లేకపోయింది.

ఇదే అంశాన్ని సంజయ్‌ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. రిమాండ్‌కు తరలించే కారణాలు బలంగా లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఏసీపీ సుదర్శన్‌ రిమాండ్‌ రిపోర్టులోని తప్పులను సవరించి మరో సారి మొదటి అదనపు జడ్జి ముందుంచారు. దీన్ని పరిశీలించిన జడ్జి సంజయ్‌ని రిమాండ్‌కు పంపకుం డా ఒకరోజు పోలీసుల అదుపులోనే ఉంచుకొని, సోమవారం కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 

చివరికి ఫ్యామిలీ కోర్టుకు.. 
మొదటి అదనపు జడ్జి రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో పోలీసులు.. ప్రగతినగర్‌లో నివాసం ఉండే మరో జడ్జి సూర్యచంద్రకళ వద్దకు సంజయ్‌ను తీసుకెళ్లారు. రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ రిమాండ్‌ను తిరస్కరించారు. మొదటి అదనపు న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించారు. అయినా పట్టు వదలని పోలీసులు.. వినాయక్‌నగర్‌లో గల ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్‌ ఎదుట సంజయ్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి 11 గంటలకు విచారణ కొనసాగింది. చివరకు న్యాయమూర్తి.. సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు