జనగామ జిల్లాలో కాల్పుల కలకలం

16 Jan, 2019 10:08 IST|Sakshi

సాక్షి, జనగామ : జనగామ జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఐదుగురు దుండగులు వైన్స్‌ సిబ్బందిని తపంచతో(నాటు తుపాకీ) బెదిరించి దోపిడి చేశారు. జనగామ మండలంలోని కొడకండ్ల మండలం మొండ్రాయి క్రాస్‌ రోడ్డు సమీపంలోని తిరుమల వైన్స్ సిబ్బంది శ్రీను,రమేష్ షాప్ మూసివేసి మంగళవారం రాత్రి 10:50కి బైక్ పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో దుండగులు వీరిని మార్గమధ్యలో ఆపి రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సుమారు 6 లక్షల 70 వేల నగదు ఎత్తుకెళ్లారు. 

గతంలో కూడా ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటు తుపాకీతో కొంత మంది దుండగులు సంచరిస్తున్నారని ప్రజలు అందోళనకు గురయ్యారు. అయితే అలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని పోలీసులు అప్పడు కొట్టి పడేశారు. కానీ, ఆ దుండగులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. వర్ధన్న పేట ఏసీపీ మధుసూధన్, స్థానిక పాలకుర్తి సీఐ రమేష్ నాయక్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎస్సైలతో గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి సమాచారం దొరకలేదని ఇంకా దుండగుల గురించి జల్లెడ పడుతున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు