పొట్టకూటి కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

22 Jan, 2019 12:12 IST|Sakshi
ప్రమాద స్థలంలో బైక్‌ను ఢీకొని బోల్తా కొట్టిన వాహనం

రోడ్డు ప్రమాదంలో మాజీసర్పంచ్‌ ఆదెప్ప మృతి

తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన మృతుడి భార్య

శోకసంద్రంలో పెద్దయల్లకుంట్ల

నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, నాయకులు

చిత్తూరు, చౌడేపల్లె: ఉదయాన్నే దట్టంగా మంచు కురుస్తున్నప్పటికీ పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తుండగా సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో  తాజామాజీ సర్పంచ్, వైఎస్సార్‌ సీపీ నేత ఆదెప్ప (45)మృతి చెందారు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం..పెద్దయల్లకుంట్లకు చెందిన  ఆదెప్ప ఇటుకల బట్టీలో కూలీ పనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన భార్య సుజాతతో కలిసి రోజూ పెద్దయల్లకుంట్ల నుంచి  పుంగనూరు మండలం పూజగానిపల్లె వద్ద ఇటుకలను  కోయడానికి  బైక్‌మీద వెళ్లేవారు. ఈ నేపథ్యంలో,   సోమవారం ఉదయాన్నే బైక్‌ మీద దంపతులిద్దరూ వెళ్తుండగా పెద్దయల్లకుంట్ల సమీపంలో అనపకుంట వద్ద  ఎదురుగా వస్తున్న  టాటా ఏసీ లగేజీ వాహనం వీరిని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆదెప్పకు కాలు నుజ్జునుజ్జై, తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలకు గురైన అతని భార్యను స్థానికులు  హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పెద్దయల్లకుంట్ల  పంచాయతీ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు శోకసంద్రంలో  మునిగారు. ఎస్‌ఐ నరేంద్ర తన సిబ్బందితో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వద్ద  లభించిన సెల్‌ఫోన్ల ద్వారా ఆ వాహనం ధర్మపురికి చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. వాహన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు స్వల్పగాయాలతో పరారైనట్లు స్థానికులు తెలిపారు.

ఆదెప్పకు ఎమ్మెల్యే ఘన నివాళి         
తాజా మాజీ సర్పంచ్‌ ఆదెప్ప మృతికి ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన నివాళులర్పించారు. వారికుటుంబ సభ్యులను ఫోన్‌ ద్వారా పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ  రాష్ట్ర కార్యదర్శి దామోదరరాజు అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంతాపం తెలిపిన వారిలో మాజీ  ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, దామోదరరాజు,ఎంపీపీ అంజిబాబు, జెడ్పిటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్, రైల్వే బోర్డుమెంబరు మిద్దింటి శంకర్‌నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గాజుల రామ్మూర్తి, వైస్‌ ఎంపీపీ రవిచంద్రారెడ్డి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, ఇతర నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు