-

భగ్గుమన్న దళిత సంఘాలు

1 Feb, 2019 13:34 IST|Sakshi
బాధితులకు అండగా రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే ఆర్కే

దళిత దంపతుల ఆత్మహత్యతో మంగళగిరిలో ఉద్రిక్తత

న్యాయం చేయాలంటూ  మృతదేహాలతో నడిరోడ్డుపై ధర్నా

బాధితులకు అండగా రోడ్డుపై     బైఠాయించిన ఎమ్మెల్యే ఆర్కే

ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం.. ఆరుగురిపై కేసు నమోదుకు హామీ

సివిల్‌ వివాదంలో తలదూర్చిన పోలీసుల వేధింపుల కారణంగా దళిత యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దంపతుల ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించాయి.దంపతుల మృతదేహాలతో మంగళగిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో దళితుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు రాత్రి ఏడుగంటల సమయంలో ప్రభుత్వం దిగిరావడంతో బాధితులు ఆందోళన విరమించారు.  

మంగళగిరి: మండలంలోని నవులూరు గ్రామంలో చోటుచేసుకున్న దళిత యువ దంపతులు మిరియాల వెంకటకిరణ్, హెలీనా ఆత్మహత్యలతో దళితసంఘాలు భగ్గుమన్నాయి. నవులూరు నుంచి మృతదేహాలను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించేం దుకు పోలీసులు ప్రయత్నిచగా స్థానికులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఆత్మహత్యలకు కారణమైన ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీం పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా వినకపోవడంతో మధ్యాహ్నం వరకు మృతదేహాలు ఇంటి వద్దనే ఉన్నాయి. యువ దంపతుల ఆత్మహత్య సమాచారం తెలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంట్‌ అధికారప్రతినిధి పచ్చల శ్యాంబాబు, జిల్లా కార్యదర్శి ఈపూరి ఆదాం, పలువురు నాయకులతో మధ్యాహ్నం ఒకటిన్న గంటల సమయంలో కిరణ్‌ ఇంటికి వెళ్లారు. కిరణ్‌ తండ్రి భోరున విలపించి, తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని, తన కొడుకు, కోడలి మృతికి కారణమైన వారికి శిక్షపడేవరకు పోరాడతామని స్పష్టంచేశారు.

మృతదేహాలను ఆటోలో ఉంచి మంగళగిరి వెళ్లబోగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు అడ్డం తిరగడంతో పోలీసులు ఆటోను అడ్డుకోలేకపోయారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రధాన రహదారికి రెండు వైపులా మృతదేహాలను ఉంచి ఆందోళనకు దిగారు. మహిళలు, యువకులు చేరుకుని ఆందోళన చేపట్టారు, వారికి మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్సార్‌ సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.  ఏఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రామకృష్ణ, ఎస్‌బీ డీఎస్పీ రామాంజనేయులు, తహసీల్దార్‌ వసంతబాబు ఆందోళన విరమించాలని కోరినా కలెక్టర్, ఎస్పీ వచ్చి నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే తాము ఆందోళన విరమిస్తామని, లేదంటే ఇక్కడే మృతదేహాలను ఖననం చేస్తామని మృతుని బంధువులు తేల్చిచెప్పారు. దళిత యువదంపతులు ఆత్మహత్యలకు నిరసనగా గంటల తరబడి మృతదేహాలతో రోడ్డుపై ఆందోళన చేస్తున్నా కూతవేటు దూరంలోనే ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ పట్టించుకోలేదంటే దళితులపై ప్రభుత్వానికి, టీడీపీకి ఉన్న వివక్ష తెలుస్తోందంటూ  దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. ఎక్కడో విశాఖపట్నంలో ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే అరగంటలో బయటకు వచ్చి ప్రకటన చేసిన డీజీపీకి యువదళిత దంపతుల ఆత్యహత్యలు కనపడలేదా అని సూటిగా ప్రశ్నించారు.

దళితులంటే చంద్రబాబుకు వివక్ష : ఆర్కే
తొలి నుంచీ చంద్రబాబుకు దళితులంటే వివక్షని అందుకే దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానిం చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. చంద్రబాబుతోపాటు మంత్రులకు సైతం దళితులంటే చిన్నచూపేనని వారి ప్రకటనలే రుజువు చేశాయన్నారు. సివిల్‌ పంచాయితీల్లో పోలీసులు తలదూర్చకూడదని చట్టం చెబుతున్నా కిరణ్‌తో అతని భార్యను స్టేషన్‌కు పిలిపించి హింసించి, ప్రామిసరీ నోట్లు, స్టాంపులు, ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఆత్మహత్యలకు కారణమైన పోలీసులు, అందుకు కారణమైన ఆరుగురి నిందితులను కఠినంగా శిక్షించి, కిరణ్‌ కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీలు, దళిత, క్రిష్టియన్‌ సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత దంపతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఎస్పీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, బుర్రముక్క వేణుగోపాలరెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆకురాతి రాజేష్, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మల్లవరపు నాగయ్య, నూతక్కి జోసఫ్, ఎస్సీ, ఎస్టీ నాయకులు కారుమంచి రామారావు, వలపర్ల కిషోర్, సీపీఎం నాయకులు జె.వి.రాఘవులు, ఎం.రవి, భాగ్యరాజ్, పిల్లలమర్రి బాలకృష్ణ తదితరులు బాధితులకు అండగా నిలిచారు.

ఏమి జరిగిందంటే..
మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామానికి చెందిన మిరియాల వెంకటకిరణ్‌ (34)  విజయవాడలోని ఓ కన్సల్టెంట్‌ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన బొమ్మా రామకృష్ణ, చెల్లి సతీష్, హైదరా బాద్‌కు చెందిన గంగా జగపతి, యోగేష్‌ ఆ కన్సల్టెంట్‌ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఆ సంస్థ నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తుంది. మిరియాల వెంకట కిరణ్‌ పలువురు యువకుల వద్ద డబ్బులు వసూలు చేసి సంస్థకు చెల్లించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెంది న తమ్మిశెట్టి రాజశేఖర్‌ నుంచి డబ్బు వసూలు చేసిన వెంకటకిరణ్‌ ఆ మొత్తాన్ని బొమ్మా రామకృష్ణకు చెల్లించారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తమ్మిశెట్టి రాజశేఖర్‌ ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో వెంకటకిరణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టారు. దీంతో వెంకటకిరణ్‌ను ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ సత్యనారాయణ వేధింపులకు గురిచేయడంతోనే తన కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారని వెంకటకిరణ్‌ తండ్రి సుబ్బారావు ఆరోపించారు.

ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం
మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి 7 గంటల వరకు హైడ్రామా నడిపిన పోలీసులు, ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాకతప్పలేదు. దంపతుల ఆత్మహత్యలకు కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కుటుంబానికి న్యాయం చేస్తామని తహసీల్దార్‌ వసంతబాబు, పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మరోమారు పోరాటం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, దళితసంఘాల నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు