దళితుడిని కట్టేసి కొట్టి చంపారు

22 May, 2018 03:53 IST|Sakshi

రాజ్‌కోట్‌ (గుజరాత్‌): చెత్త ఏరుకొని జీవనం సాగించే ఓ దళితుడిని తాడుతో కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. ముఖేష్‌ వనియా, తన భార్య జయాబెన్‌తో కలసి రాజ్‌కోట్‌లో చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం షాపర్‌లోని రాడాడియా ఫ్యాక్టరీ వద్ద దంపతులిద్దరు చెత్తను సేకరిస్తుండటాన్ని యజమాని గమనించాడు. వారిని దొంగలుగా అనుమానించిన ఆయన, తన నలుగురు స్నేహితులతో కలసి ముఖేష్‌ను తాడుతో కట్టేసి దారుణంగా కొట్టారు. తన భర్తను కొట్టవద్దని జయాబెన్‌ వేడుకున్నా కనికరించలేదు.. సరికదా ఆమెను కూడా కర్రలతో చావబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముఖేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, జయాబెన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యజమాని జయకుష్‌తో పాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రాజకోట్‌(గ్రామీణ) ఇన్‌చార్జి ఎస్పీ శ్రుతి మెహతా తెలిపారు. దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను జిగ్నేశ్‌ మేవానీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. కాగా, మృతుని కుటుంబానికి గుజరాత్‌ ప్రభుత్వం రూ.8.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.

మరిన్ని వార్తలు