దారుణం: దొంగ అంటూ కొట్టి చంపేశారు!

21 May, 2018 12:49 IST|Sakshi
ముఖేష్‌పై దాడి చేస్తున్న ఫ్యాక్టరీ సిబ్బంది

ఉనా కంటే అత్యంత దారుణ ఘటన: జిగ్నేశ్‌ మెవానీ

గాంధీనగర్‌ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం చోటుచేసుకుంది. దళితుడిని కట్టేసి విచక్షణారహితంగా కొట్టి హింసించడంతో బాధితుడు మృతిచెందాడు. అతడి భార్యపై సైతం దాడి చేయగా ఆమె గాయపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోను దళిత ఉద్యమ నేత, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. 

ఆ వివరాలిలా.. ముఖేష్‌​ వనియా తన భార్యతో కలిసి రాజ్‌కోట్‌లో నివాసం ఉండేవాడు. చెత్త ఏరుకుని జీవనం సాగించే ముఖేష్‌ ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీ వైపు వెళ్లాడు. ఆ దళితుడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని అవమానించడంతో పాటు తాడుతో కట్టేసి  చచ్చేలా కొట్టారు. ముఖేష్‌ భార్యపై కూడా దాడి చేశారు. ఉద్యోగులు విచక్షణా రహితంగా రాడ్లు, కర్రలు, తాడు లాంటి వాటితో కొట్టడంతో అమాయకుడు ముఖేష్‌ మృతిచెందగా, అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 

దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను జిగ్నేశ్‌ మేవానీ పోస్ట్‌ చేయగా చర్చనీయాంశంగా మారింది. 2016లో జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని ఆందోళన వ్యక్తం చేశారు. కుల ఘర్షణలతో అమాయకులు చనిపోతున్నా గుజరాత్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫేస్‌బుక్‌లో జిగ్నేశ్‌ మేవానీ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు