దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు

26 Jun, 2020 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రాజుకుంది. ఆయన కొడుకులు దాసరి అరుణ్ కుమార్‌, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి అరుణ్‌ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. సినీ ఇండస్ట్రీకి గాడ్‌ ఫాదర్‌గా నిలిచినటువంటి దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి పంచాయితీ నెలకొనడం పట్ల ఆయన అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి త్వరగా ఫుల్‌స్టాప్‌ పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడాలని పలువురు వాపోతున్నారు.  

ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. ‘ ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్‌ మా ఇంటి గేటు దూకి లోపలికి వచ్చాడు. మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ నా భార్య, నాపై దాడి చేశాడు. అంతేకాకుండా మా నాన్న బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్న(దాసరి) రాసిన వీలునామా ప్రకారం ఆయన మనవరాలు, నా కూతురు ఈ ఇంటికి అర్హురాలు. ఆస్తుల కోసం దాసరి అర్జున్‌ దౌర్జన్యం చేస్తున్నాడు. సి. కళ్యాణ్‌, మురళీమోహన్‌, మోహన్‌బాబు వంటి సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కరించాలి. అదేవిధంగా దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అన్నారు.    

మరిన్ని వార్తలు