ఆస్తి కోసం కుమార్తె, అల్లుడి దాష్టీకం

26 Feb, 2018 10:01 IST|Sakshi
పరారీలో ఉన్న గీత, నాగరాజు(ఫైల్‌),తల్లి సునందమ్మను గదిలో బంధించిన దృశ్యం

వృద్ధురాలిని, ఆమె మరో కుమార్తెను గదిలో బంధించి వేధింపులు

రంగప్రవేశం చేసిన పోలీసులు

బాధితులకు విముక్తి

మండ్య: ఆస్తి కోసం ఆ కుమార్తె అమానుషంగా వ్యవహరించింది. కని పెంచి పోషించి ఓఇంటిదానిని చేసినా కనికరం చూపలేదు. భర్తతో కలిసి తల్లిని, మతిస్థిమితం లేని చెల్లెలను గదిలో బంధించింది. ఈ ఉదంతం మండ్య నగరంలో ఉన్న హౌసింగ్‌ బోర్డు కాలనిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు..ఇక్కడి లేఔట్‌లో సునందమ్మ  భర్త విధానసౌధలో  పనిచేస్తూ ఒక ప్రమాదంలో మృతి చెందాడు.  సునందమ్మకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గీతను  తాలుకాలోని ముద్దేగౌడనదొడ్డి గ్రామానికి చెందిన నాగరాజుకు ఇచ్చి వివాహం చేసింది.  వివాహ సమయంలో ద్విచక్ర వాహనంతో పాటు 200 గ్రాముల బంగారం, రెండు సైట్లు కట్నంగా సమర్పించింది. సునందమ్మ చిన్న కుమార్తె రమ్యకు మతిస్థిమితం సరిగా లేదు.

ఆమెను ఆటో డ్రైవర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని రోజుల తర్వాత  అతను రమ్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో రమ్యను సునందమ్మే పోషిస్తోంది. అయితే సునందమ్మ నివాసం ఉంటున్న డూప్లెక్స్‌ హౌస్‌పై పెద్ద కుమార్తె, అల్లుడు కన్నువేశారు. ఇల్లు విక్రయించాలని పట్టుబట్టారు. దానికి సునందమ్మ అంగీకరించలేదు. దీంతో గీత, ఆమె భర్త నాగరాజులు సునందమ్మ, రమ్యను గదిలో బంధించి వేధింపులకు పాల్పడ్డారు. రెండు రోజులుగా గదిలో బంధీగా ఉన్న సునందమ్మ  ఆదివారం ఉదయం  కిటికీ తెరిసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు ఘటనా స్థలానికి చేరుకొని  తలుపులు తీసి బాధితులకు విముక్తి  కల్పించారు. గీత, నాగరాజుపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

మరిన్ని వార్తలు