కీర్తి ఇలా దొరికిపోయింది..

29 Oct, 2019 08:37 IST|Sakshi
మృతురాలు రజిత, కుమార్తె కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌

సాక్షి, హయత్‌నగర్‌ : ప్రేమ మైకంలో ఓ కూతురు కన్న తల్లినే చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. తప్పుదారిలో వెళ్తున్నావని తల్లి మందలించినందుకే ఈ పాపానికి ఒడిగట్టింది. సమాజం తలదించుకునే ఈ సంఘటన హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం...  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్నేముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి, రజిత అలియాస్‌ రుద్రమ్మ(38) దంపతులు. వీరికి కీర్తి ఒక్కతే కూతురు.

శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూర్‌లో ఉంటూ అక్కడే  ద్వారకా సాయినగర్‌ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాడు. కీర్తి(19) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కొన్ని నెలల క్రితం పక్క కాలనీలో నివసించే కృష్ణారెడ్డి కుమారుడు బాల్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వివాహం చేసుకోవాలనుకున్నారు.

ఇందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే కీర్తి కొంతకాలంగా ఇంటి పక్కన నివసించే పర్వతాలు కొడుకు శశికుమార్‌తోనూ ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లి ఓవైపు బాల్‌రెడ్డితో వివాహం కుదిరిన తర్వాత మరోవైపు శశికుమార్‌తో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావని కూతురును మందలించింది. తన ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరించింది. దీనిని భరించలేని కీర్తి తన ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందనే భావనతో తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. దీనికి ప్రియుడు శశికుమార్‌ సహకారం తీసుకుంది. ఈ నెల 19న తండ్రి ఇంట్లో లేని సమయంలో కీర్తి, శశికుమార్‌లు కలిసి రజిత మెడకు చున్నీతో ఉరి బిగించి చంపారు.  

కారులో శవం తరలింపు  
కీర్తి తల్లి శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడు శశికుమార్‌తో కలిసి మూడు రోజులు గడిపింది. తర్వాత దుర్వాసన రావడంతో శవాన్ని తరలించాలని నిర్ణయించుకున్నారు. శశికుమార్‌ తండ్రి కారు (టీఎస్‌ 06 ఈఎల్‌ 4142)లో శవాన్ని తీసుకెళ్లి రామన్నపేట్‌ సమీపంలో రైలు పట్టాలపై పడేశారు. ఇదంతా జరిగిన రోజుల్లో తండ్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి రాలేదు. అయితే రామన్నపేట రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని రెండు రోజుల పాటు వేచి చూసి దహన సంస్కారాలు నిర్వహించినట్టు తెలిసింది.  

తండ్రిపైకి నెట్టే యత్నం  
తన తండ్రి వేధింపులు భరించలేకనే తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించేందుకు కీర్తి ప్రయత్నించింది. తల్లి శవాన్ని పడేసిన తర్వాత తాను స్నేహితులతో కలిసి వైజాగ్‌ టూర్‌కు వెళ్తున్నానని ఈ నెల 23న తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె టూర్‌కు వెళ్లకుండా ప్రియుడి ఇంట్లోనే ఉంది. ఈ నెల 24న ఇంటికి వచ్చిన తండ్రి ‘అమ్మ కనిపించడం లేద’ని కీర్తికి ఫోన్‌ చేశాడు. దీంతో టూర్‌ మధ్యలో నుంచి వచ్చినట్లు నటించి కీర్తి ఇంటికి చేరుకుంది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా తల్లి ఆచూకీ దొరకలేదు. దీంతో తన తండ్రి తరచూ తాగి వచ్చి అమ్మను వేధించే వాడని, ఈ క్రమంలో అమ్మ రజిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని కీర్తి ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  

ఇలా దొరికిపోయింది...  
కీర్తి ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై శ్రీనివాస్‌రెడ్డి కంగు తిన్నాడు. కూతురును గుచ్చిగుచ్చి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో బంధవులకు విషయాన్ని తెలపడంతో వైజాగ్‌ టూర్‌కు ఎందుకు వెళ్లావు? ఎవరెవరు నీ వెంట వచ్చారు? వారి వివరాలు, ఫోన్‌ నంబర్లు ఇవ్వమని కీర్తిని ప్రశ్నించారు. దీంతో ఆమె పొంతన లేని సమాదానాలు చెప్పింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీర్తి నేరం చేసినట్లు ఒప్పుకుంది. నిందితులు కీర్తి, ప్రియుడు శశికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. శవాన్ని పడేసిన రామన్నపేట రైల్వే పట్టాల వద్దకు కూడా తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా