చంటితో కలిసి తల్లికి ఉరేసిన కీర్తి.. ఆపై

28 Oct, 2019 13:45 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : కన్నతల్లిని అమానుషంగా హత్య చేసిన కీర్తి గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చి... ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు తండ్రిపైనే ఫిర్యాదు చేసిన కీర్తి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందనే కోపంతో పల్లెర్ల కీర్తి తన తల్లి రజితను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నిందితురాలి తండ్రి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన కూతురు, భార్య కనిపించకపోవడంతో కీర్తికి ఫోన్‌ చేసినట్లు తెలిపారు. ‘కీర్తిని ఎక్కడున్నావు అని అడిగాను. తను వైజాగ్‌ వెళ్లానని చెప్పింది. మరి అమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే తనకు తెలియదంది. అయితే తను చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడంతో నాకు అనుమానం వచ్చింది. వైజాగ్‌ ఎవరితో వెళ్లావు అని నిలదీశాను. తను తడబడింది. దీంతో నాకు అనుమానం వచ్చింది. అంతేకాదు నేను తాగి వచ్చి రజితను తిట్టడంతో తను ఎక్కడికో వెళ్లిందని చెప్పింది. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని శ్రీనివాసరెడ్డి వాపోయారు.(చదవండి : కన్నతల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే)

ఉరేసుకుందని చెప్పింది..
ఈ విషయం గురించి కీర్తి బాబాయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... వైజాగ్ వెళ్ళిన విషయంపై గట్టిగా నిలదీయడంతో ఒకసారి కాలేజ్ నుంచి.. మరొకసారి స్నేహితులతో వెళ్లానని చెప్పిందన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలని అడిగితే అప్పటికప్పుడు డిలీట్ చేసిందని పేర్కొన్నారు. రజిత చనిపోయిందని గుర్తించామని తెలిపారు. బంధువులు అందరం కలిసి కీర్తిని నిలదీయడంతో.. ‘అమ్మ ఉరేసుకుంది’ అని తొలుత తమతో చెప్పిందన్నారు. అనంతరం గట్టిగా నిలదీయడంతో.. చంటి అనే వాడు కాళ్లు పట్టుకుంటే... తానే తల్లికి ఉరివేశాననే విషయం బయటపెట్టిందన్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనే విచారణ చేపట్టారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు