కంచరపాలెంలో కలకలం

11 May, 2019 18:00 IST|Sakshi
సముద్రయ్య (ఫైల్‌)

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ): ఇంట్లో జరిగిన గొడవ కన్న కూతురే తండ్రిని నరికి చంపేలా చేసింది. విశాఖ నగరం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఊర్వశి జంక్షన్‌ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కంచరపాలెం సీఐ భవానీ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్వశి థియేటర్‌ ఎదురుగా ఉన్న ఇంట్లో సముద్రయ్య (48) అనే వ్యక్తి భార్య నాగలక్ష్మి, పిల్లలతోపాటు రమణమ్మ అనే మరో మహిళతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నాగలక్ష్మి తన కుమార్తె బేబి సాయి (20), కొడుకు తరుణ్‌ (18)తో కలిసి షాపింగ్‌కు వెళ్లి కుమార్తె కోసం దుస్తులు కొనుగోలు చేసింది. ఇది చూసిన సముద్రయ్య ఇంట్లో గొడవకు దిగాడు. కొద్దిసేపటికి గొడవ సద్దు మణిగినా అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన సముద్రయ్య తిరిగి గొడవకు దిగాడు. ఈ సమయంలో తన తల్లిని తిట్టి అనుమానిస్తావా అంటూ కుమార్తె సాయి తండ్రిపై చేయి చేసుకుంది. కూతురు కొట్టడంతో తండ్రి ఆవేశం ఆపుకోలేక జుట్టు పట్టుకుని కొట్టాడు. వంటగదిలో ఉన్న చిన్న కత్తితో తండ్రిపై దాడి చేసింది. దీంతో సముద్రయ్య మెడ భాగంలో గాయమై తీవ్ర రక్త స్రావమైంది. దీన్ని అడ్డుకునే క్రమంలో రమణమ్మ ఛాతీపైన కూడా గాయమైంది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షించి సముద్రయ్య మృతి చెందినట్లు చెప్పారు. గాయపడిన రమణమ్మను కేజీహెచ్‌కు తరలించారు.

వివాహేతర సంబంధంతో కుటుంబంలో గొడవలు..
రైల్వే లోకోషెడ్‌ ఉద్యోగి అయిన సముద్రయ్య ఎస్‌.రమణమ్మ (38) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో భార్యతోనే ఉంటానని ఒప్పుకున్న సముద్రయ్య భార్యకు తెలియకుండా రమణమ్మతో సహజీవనం కొనసాగించాడు. అతని వ్యవహారం నచ్చక నాగలక్ష్మి డీజిల్‌ లోకోషెడ్‌లోని క్వార్టర్స్‌కు వెళ్లిపోయింది. సముద్రయ్య కూడా మూడేళ్లు ఉద్యోగం విడిచి పెట్టి ఒడిశా వెళ్లిపోయాడు. అయితే ఉద్యోగం పోతుందని, పిల్లల భవిష్యత్తు పాడవుతుందని భావించిన నాగలక్ష్మి తన బాధను లోకోషెడ్‌ అధికారులకు విన్నవించుకోగా సముద్రయ్యను పిలిపించి తిరిగి ఉద్యోగం ఇప్పించారు. అతను రమణమ్మను ఇంటికి తీసుకురావడంతో చేసేదిలేక అందరూ కలిసే ఉంటున్నారు.

గురువారం రాత్రి భార్య నాగలక్ష్మి పిల్లల కోసం దుస్తులు కొనుగోలు చేసి ఇంటికి వచ్చింది. ఇది చూసిన సముద్రయ్య గొడవకు దిగాడు. తరువాత బయటకు వెళ్లి మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో మళ్లీ గొడవకు దిగి కూతురి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. సాయి బీటెక్‌ 3వ సంవత్సరం చదువుతోంది. తరుణ్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తరుణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది క్షణికావేశంలో జరిగిన ఘటనగా ప్రాథమికంగా నిర్ధారించారు. 

మరిన్ని వార్తలు