ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది..

1 Nov, 2019 02:17 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌హెచ్‌వో వెంకటరెడ్డి, ఎస్‌ఐ భాగ్యరాజు. వెనుక నిందితులు

ప్రియుడి సాయంతో హత్యచేసిన కుమార్తె

మీడియాకు వివరాలు వెల్లడించిన గుంటూరు పోలీసులు 

పట్నంబజారు(గుంటూరు): ఆస్తిని తనకు రాయకుండా.. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి రాస్తుందేమోనన్న అనుమానంతో తల్లిని హత్యచేసిన కుమార్తె, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు లో గురువారం ఎస్‌హెచ్‌వో వి.వెంకటరెడ్డి, ఎస్‌ఐ భాగ్యరాజులు వివరాలను మీడియాకు వెల్లడిం చారు. నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్‌కు చెందిన ఆలపాటి లక్ష్మి (45).. కూరగాయల మార్కెట్‌లో ఓ దుకాణం నడుపుకొంటూ జీవి స్తోంది. భర్త గతంలో మృతిచెందాడు. కుమార్తె భార్గవిని 2007లో అచ్చంపేట మండలం పుట్లగూడేనికి చెందిన రామాంజనేయులుకిచ్చి వివాహం చేసింది. భార్యాభర్తలు అచ్చంపేటలోని ఓ హోటల్లో పనిచేస్తున్న క్రమంలో భార్గవికి శివరావుతో పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఇదిలా ఉండగా తల్లి లక్ష్మి పేరుతో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న 17 సెంట్లు, కుంచనపల్లిలోని అరెకరం భూమిని తన పేర్న రాయాలంటూ భార్గవి తరచూ తల్లిని వేధిస్తూ ఉండేది. దీంతో పాటు తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో.. ఆస్తిని  అతనికి రాస్తుందేమోనన్న ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 10న భార్గవి, శివరావులు గుంటూరు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా లక్ష్మి గొంతు నులిమి చంపేశారు. లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భార్గవి, శివరావులపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తమకు సంబంధం లేదని నిందితులు బుకాయించారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితులు పరారయ్యారు. చివరికి తామే హత్య చేసినట్టు అంగీకరిస్తూ బుధవారం తహసీల్దారు కార్యాలయంలో లొంగిపోయారు. హత్యకు పరోక్షంగా భర్త రామాంజనేయులు కూడా సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. హత్యచేసిన రోజే లక్ష్మి మెడలోని బంగారు గొలుసు, రూ.39 వేలను నిందితులు తీసుకెళ్లగా.. పోలీసులు బంగారు గొలుసు, సెల్‌ఫోన్, రూ.7 వేలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు