అత్తను హత్య చేసిన కోడలి అరెస్ట్‌

20 Aug, 2019 09:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చాంద్రాయణగుట్ట: వృద్ధాప్యంలో ఉన్న అత్తకు సేవ చేయడం ఇష్టం లేక ఆమెను హత్య చేసిన  కోడలితో పాటు నేరాన్ని కప్పి పుచ్చేందుకు సహకరించిన ఆమె భర్తను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ ఎంఏ రషీద్,  ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. బండ్లగూడ హషామాబాద్‌కు చెందిన చాంద్‌పాషా, కౌసర్‌ బేగం భార్యభర్తలు. చాంద్‌పాషా తల్లి ఖైరూన్‌ బేగం (68) వృద్ధాప్య కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది.

అప్పుడప్పుడు చాంద్‌ పాషా ఇంటికి వచ్చిన సమయంలో కోడలు తనను సరిగ్గా చూసుకోలేదు. ఈ విషయమై ఖైరూన్‌బేగం  కొడుకు, కోడలిని నిలదీసింది. దీనిని మనసులో ఉంచుకున్న కౌసర్‌ అత్తను అంతమొందించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న భర్త ఇంట్లో లేని సమయంలో అత్తపై దాడి చేసి హత్య చేసింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఇంటికి వచ్చిన అతను  గదిలో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు బంధువులను నమ్మించి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు