వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

27 Aug, 2019 08:25 IST|Sakshi

ఇంటి స్థలం కోసం భౌతిక దాడి, పోలీస్‌ స్టేషనులో నిర్బంధం

పత్రాలపై సంతకం కోసం పోలీసులూ ఒత్తిడి...!

ఆర్డీవోను ఆశ్రయించిన వృద్ధులు

సాక్షి, తెనాలి: వృద్ధాప్యంలో ఉన్న తమను ఆదరించకపోగా, ఆస్తి కోసం వేధిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతూ తప్పుడు కేసుతో పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధానికి గురిచేసిన కోడలు నుంచి తమకు రక్షణ కల్పించాలని కొల్లిపర మండల గ్రామం శిరిపురానికి చెందిన డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు అధికారులను వేడుకున్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో అర్జీనిచ్చారు. తెనాలి ఆర్డీవో ఎ.శ్యామ్‌సుందర్‌ అర్జీలను స్వీకరించారు. అర్జీలో విక్టోరియమ్మ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.

తాడిగిరిపాడులో నివసిస్తున్న డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు కోడలు భాగ్యలక్ష్మి వేధింపులను తట్టుకోలేక శిరిపురం చేరుకున్నారు. అక్కడే కూలిపనులు చేసుకుంటూ మూడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి పూరిల్లు వేసుకుని నివసిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత కొడుకు గోపాలరావు, కోడలు భాగ్యలక్ష్మి కూడా శిరిపురం వచ్చారు. తల్లిదండ్రులు  ఉండే స్థలంలోనే మరో ఇల్లు వేసుకుని వేరుకాపురం ఉంటున్నారు. వీరి మంచీచెడూ చూడటం లేదు. కోడలు పేరిట తాడిగిరిపాడులో ఇందిరమ్మ ఇల్లు ఉంది. అయితే తల్లిదండ్రులు ఉంటున్న నివాస స్థలాన్ని కూడా కోడలు పేరుతో రాసివ్వమంటూ కొడుకు గోపాలరావు ఒత్తిడి చేస్తున్నాడు.

బతికున్నంతకాలమైనా స్థలాన్ని తమ అధీనంలోనే ఉంచమని వేడుతున్నా వినలేదు. హృద్రోగంతో బాధపడుతున్న మామ, అత్త విక్టోరియమ్మను ఆస్తి కోసం కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అప్పటికీ స్థలం ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో కొల్లిపర పోలీస్‌స్టేషనులో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు 23వ తేదీ సాయంత్రం 5 గంటల్నుంచి అర్ధరాత్రి వరకు వృద్ధ దంపతులను నిర్బంధించారు. 
కొల్లిపర పోలీసులు కూడా కోడలుకే మద్దతునిస్తూ, స్టాంపు పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు.  నివసిస్తున్న స్థలం మినహా మరే ఆధారం లేని తమను రోడ్డుకీడ్చారని, గతిలేని స్థితిలో అదే ఊరిలో ఉంటున్న అల్లుడి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని వృద్ధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలి వల్ల తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించి, తమ ఇంటిలో తాము ఉండేలా న్యాయం చేయాలని విక్టోరియమ్మ భర్తతో సహా ఆర్డీవోను వేడుకుంది.

మనుమలను దూరం చేశారు.. 
వృద్ధాప్యంలో ఒంటరి జీవితం నరకప్రాయమని, కనీసం చనిపోయేంతవరకైనా తనతో కోడలు, మనుమ సంతానం కలిసుండేలా ఆదేశించాలని పట్టణ సుల్తానాబాద్‌కు చెందిన వృద్ధురాలు ధనావత్‌ పట్నీబాయి (70) ‘స్పందన’లో ఆర్డీవోను కలిసి అర్జీనిచ్చారు. భర్త మరణంతో తాను సుల్తానాబాద్‌లోని సొంతంటిలో పెద్దకొడుకు కుటుంబంతో కలసి ఉంటున్నట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడైన తన పెద్ద కొడుకు మునినాయక్‌ గత మే నెల 27న ఆటోప్రమాదంలో మరణించాడని, ఉమ్మడి కుటుంబం అయినా కొడుకు చనిపోయాక ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో తన పేరు లేకుండా చేశారని పట్నీబాయి చెప్పారు.

ఆధార్‌లో మార్పులు చేయించుకు వస్తానంటూ కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లినట్టు తెలిపారు. ఇప్పుడేమో ‘నేను రాను...మీతో నాకు అవసరం లేదు’ అంటోందని చెప్పారు. ఎవరూ లేకపోవటంతో పెళ్లివయసుకొచ్చిన చిన్న కుమార్తెతో ఉంటున్నానని, ఆమె వివాహం తర్వాత మళ్లీ ఒంటరినవుతానని ఆవేదనగా అన్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు మనుమ సంతానంతో సహా కోడలు తన ఇంటి వద్ద ఉండేలా చూడాలంటూ ఆర్డీవోను అభ్యర్థించారు.
– ధనావత్‌ పట్నీబాయి 

మరిన్ని వార్తలు