కూతురిని కడతేర్చిన తండ్రి అరెస్ట్‌

15 Nov, 2018 10:42 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు శివకుమార్‌

చౌటుప్పల్‌ (మునుగోడు) : భార్యపై అనుమానంతో కూతురుని కడతేర్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల ను బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ బాపురెడ్డి వెల్లడిం చారు. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకుమార్‌కు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షర అలియాస్‌ స్వప్నతో గత ఏడాది ఆగస్టు 16న వివాహం జరి గింది. శివకుమార్‌ కుటుంబం జీవనోపాధి నిమి త్తం సమీపంలోని ఎల్లగిరి గ్రామం వద్ద కిరాణం షాపు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు.

కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి సంసారం రానురాను గొడవలకు దారితీసింది. శివకుమార్‌ తరుచూ భార్యతో గొడవపడేవాడు.  ఈ క్రమంలో అక్షర గర్భం దాల్చింది. మొదటి కాన్పుకావడంతో ప్రసవం కోసం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అక్కడే ఈ ఏడాది ఆగస్టు 1న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు బారసాల చేసి నిహారిక అనే పేరు పెట్టారు.  మూడు నెలల అనంతరం దీపావళి పండుగకు అక్షర చంటిబిడ్డతో కలిసి అత్తగారి ఇంటికి వచ్చింది.

నిత్యం భార్యపై అనుమానమే..
శివకుమార్‌ ఇంటర్మీడియట్‌ వరకే చదువుకున్నాడు. తన భార్య అక్షర బీటెక్‌ పూర్తి చేసింది. తనకంటే ఎక్కువగా చదువుకుందని భార్యను అనుమానించేవాడు. ఇంటి వద్ద ఖాళీ సమయంలో అక్ష ర ఫోన్‌ మాట్లాడేది. తనను కాకుండా ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో దంపతుల నడుమ నిత్యం గొడవలు జరిగేవి.

బిడ్డ తనకు పుట్టలేదని..
ఇప్పటికే భార్యతో నిత్యం గొడవ పడుతున్న శివకుమార్‌ బిడ్డ జన్మించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైన  కూతురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సరైన  సమయం కోసం వేచివున్నాడు. ఈ క్రమంలోనే శివకుమార్‌ తల్లిదండ్రులు ఈనెల 11న దీపావళి నోముల కోసం తమ సొంత గ్రామమైన నాగారం వెళ్లారు. ఆరోజు తమ తల్లిదండ్రులు కొయ్యలగూడెం రారని గ్రహించిన శివకుమార్‌ ఇదే అదునుగా భావించాడు.

ఎలాగైన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో భార్యతో గొడవపడ్డాడు. కొంత సేపటికి భార్య బయట ఉన్న బాత్రూంకు వెళ్లింది. వెంటనే మంచంపై నిద్రిస్తున్న బిడ్డను గొంతు నులిమి తలను మంచానికి కొట్టాడు. ఈ శబ్దానికి బయట ఉన్న అక్షర పరుగున లోనికి వెళ్లింది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా  మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి అక్షర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం అరెస్టు చేశామన్నారు. రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై చిల్లా సాయిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు