దావూద్‌ ఇబ్రహీం అనుచరుడి అరెస్టు

25 May, 2019 15:56 IST|Sakshi

ఖాట్మండు : దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు యూనస్‌ అన్సారీని నేపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల భారత నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్సారీతో పాటు ముగ్గురు పాకిస్తాన్‌ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇస్లామిక్‌ స్టేట్‌ కోసం పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. భారత ఇంటలెజిన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అతడిని ఖాట్మండూ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కాగా నేపాల్‌ మాజీ మంత్రి సలీం అన్సారీ,  ఆయన కుమారుడైన యూనస్‌ అన్సారీకి అండర్‌వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐఎస్‌ ఉగ్రవాదులతో కూడా యూనస్‌కు పరిచయం ఏర్పడింది. వారితో చేతులు కలిపిన యూనస్‌ ఐఎస్ ఫండింగ్‌ కోసం భారత నకిలీ కరెన్సీని మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం నకిలీ కరెన్సీని తీసుకువస్తున్న ముగ్గురు పాకిస్తానీయులను రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం గురించి లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు