పోలీస్‌ శాఖలో కలకలం..!

11 Mar, 2019 11:40 IST|Sakshi
భువనగిరిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద విచారణ జరుపుతున్న పోలీసులు(ఫైల్‌)

సాక్షి, యాదాద్రి :  డీసీపీ రామచంద్రారెడ్డితో పాటు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ను రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా పోలీస్‌ శాఖలో ఒక్కసారిగా కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరుల ఆగడాలను అదుపుచేయలేకపోవడంతో ఇతర ఆరోపణలు రావడంతోనే వేటు వేశారని తెలుస్తోంది. ఏకంగా ఉన్నతాధికారిపైనే చర్యలు తీసుకోవడంతో పోలీస్‌ యంత్రాం గంలో ప్రకంపనలు సృష్టించింది.

నిఘా కఠినతరం
పోలీస్‌ అధికారుల పనితీరుపై రాచకొండ సీపీ నిఘా కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఇంటలిజెన్స్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తప్పు చేసిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. సిట్, ఇంటలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన రిపోర్ట్‌  ఆధారంగానే భువనగిరి జోన్‌ డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయానికి, భువనగిరి పట్టణ ఇన్స్‌పెక్టర్‌ వెంకన్నగౌడ్‌ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారని సమాచారం.
 
భూ వివాదాల్లో జోక్యం, సెటిల్‌మెంట్లు..!
జిల్లాలో భూముల ధరల విపరీతంగా పెరగడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. భూ వివాదాల్లో తలదూరుస్తున్న పోలీసులు సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. భువనగిరి శివా రులోని ఆర్డీఓ కోర్టులో గల సర్వే నంబర్‌ 730లో 5.20 ఎకరాల  భూమిని నయీమ్‌ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్‌ భువనగిరి రిజిష్ట్రేషన్‌ కార్యాలయంలో ఇటీవల అక్రమ రిజిష్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారన్న ఫిర్యాదులు బాధితులనుం చి ఉన్నతస్థాయికి వెళ్లాయి. దీంతో మళ్లీ నయీమ్‌ అనుచరుల ఆగడాలు ప్రారంభమయ్యాయన్న సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మరో వైపు ఇటీవల జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలపైనా ఫిర్యాదులు రావడంతో వారిపై బదిలీ వేటు వేశారు. ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారుల బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యాదగిరిగుట్టలో నయీమ్‌ బాధితులకు సహకరించకుండా వారినే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ముగ్గురు పోలీస్‌ అధికారులను సీపీ మందలించినట్లు సమాచారం. అలాగే యాదగిరిగుట్ట సబ్‌ డివిజన్‌లో ఒక ఎస్‌ఐ విధి నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఆయన్ను కూడా మందలించి పంపించారని తెలుస్తోంది. 

సీపీకి అందిన ఫిర్యాదులు!
నయీమ్‌ అనుచరులకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో సీపీ సీరియస్‌గా పరిగణించి చర్యలు తీసుకున్నాడని తెలుస్తోంది. డీసీపీ తన కింది ఉద్యోగులు కొందరితో కలిసి నయీమ్‌ అనుచరుల భూ సెటిల్‌మెంట్లను చూసీ చూడనట్లు వ్యవహరించి వారికి సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి.  భువనగిరి శివారులోగల సర్వే నంబర్‌ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ కోసం ఇటీవల నయీమ్‌ అనుచరులు పాశం శ్రీను, అ బ్దుల్‌ నాసర్‌ మరికొందరు కలిసి భువనగిరి రిజి స్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రైవేట్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ సహకారంతో నయీమ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను ఇతరుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు సిద్ధం అయ్యారు.

ఒకరి పేరుమీద స్టాంప్‌ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లారు. అయితే పట్టాదారు పాస్‌ పుస్తకాలు తెస్తేనే రిజిస్టర్‌ చేస్తామని అక్కడ అధికారులు చెప్పడంతో త్వరలో తెస్తామని చెప్పి స్టాంప్‌ డ్యూటీ చెల్లించామని రిజిస్టర్‌ చేయమని డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా ఒత్తిడి తెచ్చారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో ఉంచారు. నయీమ్‌ అనుచరుల నుంచి తీవ్రమైన ఒత్తిడులు రావడంతో అనుమానం వచ్చిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అధికారులు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ను రద్దు చేశారు. ఈ విషయంపై ఆ భూమికి సంబంధించిన బాధితులు సీపీ మహేశ్‌ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తక్షణమే సీపీ స్పందించి వెంటనే సిట్‌ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్,స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు భువనగిరికి వచ్చి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశా రు.

హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్,  సబ్‌ రిజిస్ట్రార్‌ను విచారించారు. ఇంట లిజెన్స్‌ అధికారులు స్థానికంగా సేకరించిన విషయాలను సీపీకి వివరించడంతో అయన డీసీపీతో సహ భువనగిరి పట్టణ ఇన్స్‌పెక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. అంతేకాకుండా నయీ మ్‌ అనుచరులైన  పాశం శ్రీను, అబ్దుల్‌ నాసర్‌ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

కొనసాగుతున్న విచారణ
బినామీ ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడుతు న్నట్లు అందిన ఫిర్యాదు మేరకు నయీమ్‌ అను చరులపై పోలీసులు భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిం దే.  ఈ విషయమై విచారణ కొనసాగుతోంది. 

పుట్టగూడెంలో ఏం జరిగింది ? 
మరోవైపు రాజాపేట మండల పుట్టగూడెంలో రేషన్‌ బియ్యం అక్రమంగా డంప్‌ చేశారన్న సమాచారంతో శనివారం రాత్రి గ్రామానికి వెళ్లిన ఎస్‌ఓటీ పోలీస్‌లపై గిరిజనులు దాడి చేశారు. బియ్యంతో పాటు పోలీస్‌ వాహనానికి నిప్పు పెట్టారు. అయితే స్థానిక పోలీస్‌లకు మామూళ్లు ఇస్తున్నామని, దాడి చేయడానికి మీరు ఎవరని ఆగ్రహంతో ఎస్‌ఓటీ పోలీస్‌లపై దాడి చేసినట్లు సమాచారం. ఇటీవల ఇక్కడి ఎస్‌ఐని బియ్యం మామూళ్లకు సంబంధించి ఆరోపణలు రావడంతోనే బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది.  

మరిన్ని వార్తలు