మిస్టరీ వీడింది..

27 Jan, 2018 12:00 IST|Sakshi

వడ్డీ వ్యాపారి వాసుదేవను హత్య చేసిన మాంసం వ్యాపారి షేక్‌ వల్లీ

తిరుమలాయపాలెంలో లెట్రిన్‌ సెప్టిక్‌ ట్యాంక్‌లో మృతదేహం

బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు

గుడివాడలో అలుముకున్న విషాదఛాయలు

తూర్పుగోదావరి  , (పెద్దాపురం): నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పెద్దాపురం మండలం గుడివాడ గ్రామ వడ్డీ వ్యాపారి పోతంశెట్టి విష్ణు ఈశ్వరులు అలియాస్‌ వాసుదేవ(50) హత్యకు గురయ్యాడు.  గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో మాంసం వ్యాపారి షేక్‌ వల్లీకి చెందిన ఇంటి ఆవరణలో సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన గోతిలో అతడి మృతదేహం లభ్యమైంది. ఈనెల 23న ఫైనాన్స్‌ సొమ్ము వసూలు నిమిత్తం తిరుమలాయపాలెం వచ్చిన విష్ణు ఈశ్వరులును షేక్‌ వల్లీ హత్య చేసినట్టు తెలిసింది. నగదు చెల్లిస్తానని చెప్పి ఇంటికి పిలిచిన వల్లీ కత్తితో విష్ణు ఈశ్వరులను తలపై నరికి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంక్‌ గోతిలో పూడ్చి ఎవరికీ అనుమానం రాకుండా మూత వేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడి ఇంటి మిద్దెపై, మృతుడి ఫైనాన్స్‌కు సంబంధించిన పుస్తకాన్ని బాత్‌రూమ్‌పై పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని ఇంట్లోంచి గోతి వరకు ఈడ్చుకెళ్లిన రక్తపు మరకలు, గోడపై ఉన్న రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్‌ ట్యాంక్‌ గోతిలోంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఎస్సై జి.ఉమామహేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ వీరయ్యగౌడ్‌ సైతం సిబ్బందితో అక్కడకు చేరుకుని సెప్టిక్‌ ట్యాంక్‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం కోరుకొండ సీఐ రవికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సైను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, గుడివాడకు చెందిన అధిక సంఖ్యలో గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని తీవ్రంగా విలపించారు. సంఘటన వార్త గ్రామంలో వ్యాపించడంతో భారీ ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఇదిలా ఉండగా సంఘటనపై ఎవరు కేసు నమోదు చేయాలనే అంశంపై ఇటు గోకవరం, అటు పెద్దాపురం పోలీసుల తర్జనభర్జన పడ్డారు. దీంతో రాత్రయినా శవాన్ని బయటకు తీయలేకపోయారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండటం, రాత్రి సమయం కావడంతో బయటకు తీయడానికి గ్రామస్తులు వెనుకంజ వేశారు. దీంతో శనివారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.  హత్యకు కేవలం నగదు లావాదేవీలేనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై స్థానికులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బైక్‌ జగ్గంపేట మండలం రాజపూడి శివారున పుష్కర కాలువ గట్టు వద్ద లభించడంతో నిందితుడు షేక్‌ వల్లీ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వారి అనుమానమే నిజమైంది
విష్ణు ఈశ్వరులు అదృశ్యమైనప్పటి నుంచి కుటుంబ సభ్యులు తిరుమలాపాలెంలో ఓ వ్యక్తి మధ్య ఘర్షణ జరిగిందని, ఆ వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలుమార్లు కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు తిరుమలాయపాలెం వచ్చి షేక్‌ వల్లీ ఇంటి చుట్టూ గాలించారు. శుక్రవారం ఇంటి ఆవరణ నుంచి దుర్వాసన వెలువడడంతో ఈ ఘాతుకం బయటపడింది.

మరిన్ని వార్తలు