అనగనగా ఓ మృతదేహం

12 Jan, 2019 10:20 IST|Sakshi
లారీలో పడి ఉన్న మృతదేహం, (సుధాకర్‌ ఫైల్‌)

తమిళనాడులో అదృశ్యం

కర్నూలు జిల్లాలో ప్రత్యక్షం

ప్యాపిలి: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ మృతదేహం అక్కడ కన్పించలేదు. ఆచూకీ చెప్పాలని బంధువులు ఆందోళన చేపట్టారు. అక్కడి పోలీసులు దిక్కుతోచని స్థితిలో ఉండగా.. సినీఫక్కీలో ఆ మృతదేహం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్లలో శుక్రవారం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు .. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలూకా అత్తిపట్టు గ్రామానికి చెందిన సుధాకర్‌ (33)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాకలూరు సిఫ్‌కార్టు పరిశ్రమలో పని చేస్తున్న సుధాకర్‌ ఈనెల 9న రాత్రి 10 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. పాండూర్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా.. ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని బైక్‌ ఒక వైపు, హెల్మెట్‌ మరో వైపు ఎగిరి పడ్డాయి. సంఘటనా స్థలంలో సుధాకర్‌ కాలు మాత్రమే ఉంది. మృతదేహం కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు పోలీసులు అటు చెన్నై వరకు, ఇటు తిరుపతి వరకు ఉన్న అన్ని వైద్యశాలల్లో తనిఖీలు నిర్వహించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు మృతదేహం కోసం అతని బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విధిలేని పరిస్థితుల్లో 140 మందిని అరెస్టు చేయాల్సి వచ్చింది.

ఎట్టకేలకు లభ్యం
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్లలోని ప్రియా సిమెంట్‌ ఫ్యాక్టరీకి శుక్రవారం అరుణాచల ట్రాన్స్‌ పోర్టుకు చెందిన టీఎన్‌ 70జే4507 నంబర్‌ గల లారీ సిమెంట్‌ లోడ్‌ కోసం చేరుకుంది. ఫ్యాక్టరీలోకి వెళ్లే ముందు సెక్యూరిటీ గార్డులు లారీని తనిఖీ చేశారు. అందులో మృతదేహం కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన తర్వాత తమిళనాడు పోలీసులు పట్రపెరంబదూరు టోల్‌గేట్‌ సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రమాదం సమయంలో రెండు సిమెంట్‌ లారీలు వెళ్లినట్లు గుర్తించారు. కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇదే తరుణంలో అరుణాచల ట్రాన్స్‌పోర్టు లారీలో మృతదేహం పడి ఉన్నట్లు తేలడంతో ఇక్కడి పోలీసులు తిరువళ్లూరు ఎస్పీకి మృతదేహం ఫొటోలు పంపించారు. ఫొటోలు పరిశీలించిన అక్కడి పోలీసులు ఈ మృతదేహం సుధాకర్‌దేనని గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఢీకొన్న వేగానికి మృతదేహం పైకి ఎగిరి పక్కనే వెళ్తున్న లారీలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. తిరువళ్లూరు సీఐ తమిళవన్నన్, ఎస్‌ఐ రవి రాచర్లకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు